పెద్దపల్లిరూరల్: స్వచ్ఛత పాటిస్తేనే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య అన్నారు. గురువారం పెద్దపల్లిలోని చీకురాయి రోడ్‌లో గల మహిళాసుపత్రి వైద్య సేవలను జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌తో కలిసి పర్యవేక్షించారు. ఈసందర్భంగా చైర్మన్ ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్ శ్రీహర్ష చొరవతో ప్రజలకు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతోందన్నారు. ప్రతీ ఒక్కరు తమవంతు బాధ్యతగా పరిశుభ్రత పాటించాలన్నారు. తర్వాత మినీటాంకు బండ్, ఎల్లమ్మ చెరువుకట్టపై కమిషనర్ వెంకటేశ్‌తో కలిసి చెత్తను ఊడ్చి తొలగించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నాయకులు తూముల సుభాష్‌రావు, సురేశ్, నదీం, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
ముత్తారం(మంథని): ముత్తారంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని గురువారం డీఆర్‌డీవో కాళిందిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీలో భోజనం అమలు తీరును పరిశీలించారు. బాలికలకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఈ నెల 14నుంచి జరుగనున్న పదోతరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ చూపి, ఉత్తీర్ణత శాతం పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. బాలికలతో కలిసి భోజనం చేశారు. ఎంపీడీవో సురేశ్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వప్న తదితరులు ఉన్నారు.
16 నుంచి ఒంటిపూట బడి
పెద్దపల్లి: ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పని దినమైన ఏప్రిల్ 23వ వరకు తరగతులు జరుగుతాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. ప్రైవేటు స్కూళ్లు కూడా ఒంటిపూట పనిచేయాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.


