మంథనిరూరల్: గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన పాలన అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. మంథని మండలం గమ్నూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని బుధవారం రాత్రి ప్రారంభించారు. రూ.3.75కోట్లతో గుమ్నూర్ నుంచి దంతెలపల్లి మీదుగా కాకర్లపల్లి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామానికి ప్రథమ పౌరుడిగా ఉండే సర్పంచ్‌లు తమ బాధ్యతలు మర్చిపోకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ గ్రామానికి ప్రగతిబాటలు పడుతున్నాయని వివరించారు. గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అవసరమైన నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రతీ గ్రామంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలికవసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. అంతకముందు మంత్రికి సర్పంచ్ చెరుకుతోట సురేశ్, పాలకవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


