కేసులు పరిష్కరిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

కేసులు పరిష్కరిస్తున్నాం

Mar 12 2026 7:45 AM | Updated on Mar 12 2026 7:45 AM

పెద్దపల్లి: సీనియర్‌ సిటిజన్ల ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం పలువురు సీనియర్‌ సిటిజన్లతో ఆయన మాట్లాడారు. వయోవృద్ధుల నుంచి అందిన ఫిర్యాదులపై రెవెన్యూ ట్రిబ్యునల్స్‌ ద్వారా పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు. పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో 130 కేసులు నమోదు కాగా 121 పరిష్కరించామని ఆయన అన్నారు. మంథనిలో 28 కేసులకు 26 కేసులు పరిష్కరించా మన్నారు. అప్పీలేట్‌ కేసులు 19 నమోదు కాగా అన్నింటినీ పరిష్కరించినట్లు వివరించారు. కాగా, కొట్టె రాజయ్య(96) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చామని కలెక్టర్‌ వివరించారు.

బొగ్గు నాణ్యతపై ప్రత్యేక దృష్టి

గోదావరిఖని: బొగ్గు నాణ్యత పెంపుపై అంద రూ దృష్టి సారించాలని సింగరేణి రామగుండం రీజియన్‌ క్వాలిటీ జీఎం సుజోయ్‌ మజుందార్‌, బెల్లంపలి రీజియన్‌ క్వాలిటీ జీఎం వీరభద్రరావు సూచించారు. రామగుండం, బెల్లంపల్లి రీజియన్‌స్థాయి సమీక్ష ఆర్జీ–1 జీఎం కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఏరియాల వారీగా థర్డ్‌పార్టీ కంపెనీల పనితీరు, శాంపిళ్ల సేకరణపై సమీక్షించారు. బొగ్గు నాణ్యతతోపాటు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని అన్నారు. బ్యాంక్‌ ద్వారా జీతభత్యాల చెల్లింపులపై ఆరా తీశారు.

ఓదెల మల్లన్నకు పూజలు

ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో భక్తులు బుధవారం ప్రత్యేక పూజలుచేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తొలుత కోనేరులో స్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీమల్లికార్జునస్వామి, శ్రీసీతారామచంద్రస్వా మి, నందీశ్వరులను దర్శనం చేసుకున్నారు. ఒగ్గు పూజారులతో స్వామివారికి పట్నాలు వేయించారు. బోనం తయారు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఈవో సదయ్య, సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు.

అథ్లెటిక్స్‌లో విద్యార్థుల ప్రతిభ

జూలపల్లి(పెద్దపల్లి): సుల్తానాబాద్‌ జూనియర్‌ కాలేజీగ్రౌండ్‌లో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్‌ పోటీల్లో స్థానిక ప్రభుత్వ బాలుర హైస్కూల్‌ విద్యార్థులు ప్రతిభ చాటారు. అండర్‌–14 విభాగం 60 మీటర్ల రన్నింగ్‌లో నిట్టు కీర్తన గోల్డ్‌, వేంశాని అక్షిత రజత, 600 మీటర్ల రన్నింగ్‌లో నిట్టు కీర్తన గోల్డ్‌, వేంశాని అక్షిత సిల్వర్‌, కొమ్మ అశ్విత్‌ రజత పతకాలు సాధించారు. వీరిని హెచ్‌ఎం, ఉపాధ్యాయులు తదితరులు బుధవారం అభినందించారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,017

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,017 ధర పలికింది. కనిష్టంగా రూ.5,323గా, సగటు రూ.6,707గా ఉందని మార్కెట్‌ కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. పలువురు రైతుల నుంచి 458 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement