కోల్‌సిటీ(రామగుండం): డిగ్రీ వరకు చదువుకున్న ఐదుగురు గృహిణులు ఒక చిన్న ఆలోచన చేశారు. అమలులోకి తీసుకు రాగా పెద్దవిజయమే సాధించింది. మహిళల్లో స్ఫూర్తి నిలిచేలా వారి ప్రయాణం ఇలా..
వ్యాపారం వైపు.. అపార్మెంట్ స్నేహం..
సదా శైలజ (భర్త మల్లేశ్ – సింగరేణి ఉద్యోగి), అల్లంకి హారిక (వేణుమాధవ్ – విన్నీ బేకరీ), బోడగుండ్ల దేవి(సదానందం – సదా ఫుడ్ కార్నర్), బొప్పరాతి కల్పన (సంతోష్ – ఎస్‌ఆర్‌ఆర్ మెడికల్ ఏజెన్సీస్), హరి రమ (కొండల్ – హెడ్ కానిస్టేబుల్) ఒకేఅపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. వీరి పరిచయం స్నేహంగా మారి వ్యాపార ఆలోచనకు దారితీసింది.
తొలత హోం ఫుడ్స్...
తొలుత శైలజ, దేవి, కల్పన కలిసి ఏడాదిపాటు అపార్మెంట్‌లోనే చకినాలు, గారెలు, లడ్డూలు, గవ్వలు వంటి తెలంగాణ పిండి వంటకాలు ఆర్డర్‌పై తయారు చేశారు. ఈ అనుభవంతో ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించారు. తొలుత మ్యాచింగ్ సెంటర్ ప్రారంభించాలనుకున్నా ఫుడ్ బిజినెస్ మంచిదని భావించి మెస్ ఏర్పాటుకు తీర్మానించారు. గతేడాది నవంబర్‌లో రూ.10 లక్షల పెట్టుబడితో గోదావరిఖని పాత మున్సిపల్ ఆఫీసు సమీపంలో వేద మెస్ ప్రారంభించారు. వీరి ఐదుగురితోపాటు మరోఇద్దరు మహిళలకూ ఉపాధి కల్పించారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి స్టీల్ పాత్రలే వినియోగించడం వీరి ప్రత్యేకత. వీరి ప్రయాణంలో భర్తలు, పిల్లలు కూడా మద్దతు అందిస్తున్నారు. మిగిలిన భోజనం వృథా కాకుండా అనాథ ఆశ్రమాలకు పంపిణీ చేస్తున్నారు. లాభాల సంగతి పక్కన పెడితే.. తాము తయారు చేసిన భోజనం తిన్నవాళ్లు ‘ఆహా.. ఎంత రుచి!’ అని చెప్పినప్పుడే తమ పెట్టుబడికి నిజమైన లాభం వచ్చినట్లేనని మహిళలు ఆనందంగా చెబుతున్నారు. స్నేహం, సమష్టి సంకల్పం, కష్టపడేతత్వం ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించగలరని ఐదుగురు గృహిణులు నిరూపించారు.


