
ముసురేసింది
జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మత్తడి దూకుతున్న చెరువులు, కుంటలు ఊపందుకున్న సాగు పనులు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు 32 గేట్ల ఎత్తి దిగువకు నీటి విడుదల
సాక్షి పెద్దపల్లి: జిల్లావ్యాప్తంగా మూడురోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వానపడుతోంది. వాగులు, చెక్‌డ్యాంలు వరదతో పరవళ్లు తొక్కుతున్నాయి. చెరువులకు భారీగా వరదనీళ్లు వచ్చిచేరుతున్నాయి. గోదావరి నదితోపాటు మానేరులో నీటి ప్రవాహం పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద భారీగా వస్తోంది. చెరువులు, వాగుల్లోనీరు చేరుతుండటంతో రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. మరికొద్ది రోజులు భారీవానలు కురిస్తే అన్ని చెరువులు మత్తడిదూకే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు మొదలు.. ఉద్యోగుల వరకూ.. ఇబ్బంది పడుతున్నారు. గొడుగులు పట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. జోరువానల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగం సూచిస్తోంది.
ఇంకా 16శాతం లోటు..
జిల్లాలోని 7 మండలాలు మినహా మిగతా ప్రాంతాల్లో సాధారణానికి మించి వానాలు కురిశాయి. ధర్మారం, రామగుండం, రామగిరి, పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, మంథని మండలాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదయ్యింది. ఈసీజన్‌లో ఇప్పటివరకు 582.5 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ, 16శాతం లోటుతో 491.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 1,018 చెరువులుండగా 210 చెరువులు మత్తడి దూకుతున్నాయి. మరో 512 చెరువులు మత్తడి పోసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
నిండుకుండలా ‘గుండారం’
కమాన్‌పూర్(మంథని): కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం, మంథని మండలాల పరిధిలోని ఆయకట్టకు సాగునీరు అందించే గుండారం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వలతో నిండుకుండలా మారింది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎస్సారెస్పీ నీటి విడుదల, గౌరీగుండం జలపాతం వరదనీటితో రిజర్వాయర్ జలకల సంతరించుకుంది. రిజర్వాయర్ నీటిమట్టం 12 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు.
చెరువులకు జలకళ
మంథనిరూరల్: గుంజపడుగు, నాగారం, విలోచవరం, కన్నాల, పుట్టపాక, ఉప్పట్ల గ్రామాల్లోని చెరువులు మత్తడి దూకుతున్నాయి. మొన్నటి వరకు నీళ్లు లేక వెలవెలబోయిన చెరువులు వరదనీటితో కళకళలాడుతున్నాయి.
మానేరు ఉధృతం
ఓదెల(పెద్దపల్లి): కనగర్తి, మడక, గుంపుల, పేట, కనగర్తి, ఇందుర్తి తదితర తీర ప్రాంతాల్లోని మానేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల ఇసుక తిన్నెలతో కనిపించిన ఏరు.. అకస్మాత్తుగా నీటితో జలకళ సంతరించుకోవడంతో స్థానికులతోపాటు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. మానేరు అవతలి వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు ఎక్కడికి అక్కడే ఆగిపోయారు. పొత్కపల్లి ఎస్సై రమేశ్ గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు.
‘ఎల్లంపల్లి’ గేట్లు మళ్లీ ఎత్తివేత
రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను సోమవారం మరోసారి ఎత్తి దిగువన ఉన్న గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో ఆదివారం రాత్రి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద భారీస్థాయిలో వచ్చిచేరుతోంది. నీటిపారుదల శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ ఉధృతికి అనుగుణంగా గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.70 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 78 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, హైదరాబాద్‌కు 295 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, నంది పంపుహౌస్‌కు 3,150 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి 1,65,632 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దీంతో గోదావరి నదికి వరద పోటెత్తింది.
జిల్లాలో సోమవారం
నమోదైన వర్షపాతం(మి.మీ.లలో)
ధర్మారం 15.1
పాలకుర్తి 24.6
అంతర్గాం 19.3
రామగుండం17.1
రామగిరి 28.2
కమాన్‌పూర్ 28.0
మంథని 17.2
జూలపల్లి(పెద్దపల్లి): వడ్కాపూర్ శివచెరువు, పెద్దాపూర్ పెద్దచెరువు, తెలుకుంట రామప్పచెరువు నీటితో కళకళలాడుతున్నాయి. భారీవర్షాలకు తోడు ఎస్సారెస్పీ డీ– 83, డీ– 86 మైనర్ కాలువల ద్వారా నీరు విడుదల చేయడంతో పొలాల్లోంచి చెరువుల్లోకి చోరుతోంది.
వరిపంటకు ఢోకాలేదు
వర్షాలకుతోడు ఎస్సారెస్పీ కాలువనీరు వచ్చి చేరుతోంది. చెరువులు దాదాపు నిండే స్థాయికి చేరాయి. వరినాట్లు పూర్తి చేస్తున్నాం. ఇక వరి పంటకు సరిపడా నీరు వచ్చి చేరుతోంది.
– మంద లక్ష్మణ్, రైతు, తెలుకుంట

ముసురేసింది

ముసురేసింది