
24న ‘జనహిత’ యాత్ర
పాల్గొననున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఏర్పాట్లపై నాలుగు జిల్లాల డీసీసీ అధ్యక్షుల సమాలోచనలు ఉప్పర మల్యాల నుంచి మధురానగర్ వరకు పాదయాత్ర మధురానగర్ వద్ద సభకు చొప్పదండి ఎమ్మెల్యే ఏర్పాట్లు హాజరుకానున్న పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, ఉమ్మడి జిల్లా మంత్రులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్రకు జిల్లాలో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈనెల 24న చొప్పదండిలో ఆమె పాదయాత్ర చేయనున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని ఉప్పరమల్యాల నుంచి మధురానగర్ వరకు యాత్ర సాగనుంది. దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఉమ్మడి జిల్లాకు తొలిసారిగా రానున్న నేపథ్యంలో ఆమె పాదయాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు పట్టుదలతో ఉన్నారు.
గంగాధరలో బహిరంగ సభ..
ఉప్పర మల్యాల నుంచి గంగాధరలోని మధురానగర్ చౌరస్తా వద్ద బహిరంగ సభకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. దాదాపు 6 కిలోమీటర్ల వరకు సాగే పాదయాత్రలో మీనాక్షి పలువురు ప్రజలతో మాట్లాడతారు. అదే సమయంలో అవసరమైన చోట శ్రమదానం, స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సభకు ఉమ్మడి జిల్లా నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులు ఇప్పటికే ఈ సభ నిర్వహణ, ఏర్పాట్లపై ఫోన్‌లో మంతనాలు సాగిస్తున్నారు. 24న పాదయాత్ర అనంతరం మీనాక్షి జిల్లాలోనే బస చేయనున్నారు. ఆమె కరీంనగర్ జిల్లా కేంద్రంలో బస చేస్తారా..? లేక గంగాధర మండలంలోనే ఆగుతారా..? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మరునాడు 25న ఉదయం గంగాధర మండలంలోని వెంకటాయపల్లిలోని ఎల్‌కే గార్డెన్స్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశానికి ఆమె నేతృత్వం వహిస్తారు.
నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భర్తీ కాని నామినేటెడ్ పదవుల విషయంలో కేడర్ తీవ్ర అసంతృప్తిగా ఉంది. పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతీ అసెంబ్లీకి ఇద్దరు నేతల పేర్లు సూచించాలని అధిష్టానం ఆదేశించింది. అయితే కరీంనగర్ అసెంబ్లీకి మాత్రం కనీసం ఐదుగురు నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ఇక్కడి నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీలు మారి వచ్చిన వారికి కాకుండా.. పార్టీ పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నపుడు వెన్నంటి ఉన్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. డీసీసీ, పట్టణ, మండల, గ్రామ, బ్లాక్ అధ్యక్షుల భర్తీకి దరఖాస్తులు తీసుకున్నా.. ఇప్పటివరకూ ఎలాంటి పదవుల కేటాయింపు జరగలేదు. 25న మీనాక్షి నటరాజన్ నేతృత్వరంలో జరిగే సమావేశంలో ప్రతీ కార్యకర్తతో ఆమె మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో మెజారిటీ సీనియర్ నేతలు తమకు పదవుల్లో ప్రాధాన్యమివ్వాలని కోరనున్నారు. మరికొందరు ఉమ్మడి జిల్లా నేతలు పార్టీ పరిస్థితిని వివరిస్తూ.. పలువురు నటరాజన్‌కు ఇప్పటికే సమాచారం చేరవేసినట్లు తెల్సింది. ముఖ్యంగా కరీంనగర్ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని పలువురు ఆమెకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

24న ‘జనహిత’ యాత్ర

24న ‘జనహిత’ యాత్ర