
అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి ద్వారా అందిస్తున్న అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచొద్దని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టరేట్‌లో ప్రజావాణి ద్వారా కలెక్టర్ వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సమస్యలపై తక్షణమే స్పందించాలని కలెక్టర్ సూచించారు.
ఆత్మహత్యాయత్నంతో కలకలం..
ప్రజావాణి ద్వారా తన సమస్యను కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులకు విన్నవించేందుకు కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట నుంచి వచ్చిన బండి సతీశ్ ఒక్కసారిగా క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సతీశ్‌ను బయటకు తీసుకెళ్లి అంబులెన్సులో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సతీశ్ ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు.