
అందరికీ సన్నబియ్యం
● కొత్తకార్డులకు సెప్టెంబర్ కోటా
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలో కొత్తగా రేషన్‌కార్డులు పొందిన పేదలు అందరికీ సెప్టెంబర్ కోటా సన్నబియ్యం వస్తోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 12,168 కార్డులకు అవసరమైన సన్నబియ్యం కోటా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. గోదాముల నుంచి రేషన్ డీలర్లకు సన్నబియ్యం సరఫరా చేయనున్నట్లు కూడా వారు ప్రకటించారు. వర్షాకాలం నేపథ్యంలో రవాణాకు అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో కేంద్రప్రభు త్వం జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన మొత్తం కోటాను గత జూన్ నెలాఖరు వరకు కార్డు దారులకు అందజేసిన విషయం విదితమే. అప్పటివరకు కొత్తకార్డులు మంజూరైన పేదలకు కూడా పంపిణీ చేసింది. అయితే, గత జూలై, ఆగస్టు నెలల వరకు కార్డులు మంజూరైన వారికి రేషన్‌బియ్యం అందలేదు. ఈసారి వీరికి కూడా బియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బియ్యం సంచులపై సీఎం ఫొటో..
బియ్యంతోపాటు ఈసారి ‘అందరికీ సన్నబియ్యం పంపిణీ.. ప్రజాప్రభుత్వంతోనే సాధ్యం’ నినాదం ముద్రించిన సంచులు కూడా పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేయన్నట్లు వెల్లడిస్తున్నారు. ఈ సంచులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలు ముద్రించి ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 413 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో పాతరేషన్‌కార్డులు 2,23,553 ఉన్నాయి. ఇప్పటివరకు కొత్తగా 12,168 కార్డులు అధికారులు పంపిణీ చేశారు. దశాబ్ద కాలంగా రేషన్‌కార్డులు లేక జిల్లాలో ని పేదలు అనేక సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. ప్రస్తుతం కార్డులు రావడంతో తమకు ఇక అన్ని పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని కొత్త కార్డుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.