చాలాచోట్ల త్రిముఖ పోటీ! | Sakshi
Sakshi News home page

చాలాచోట్ల త్రిముఖ పోటీ!

Published Thu, Nov 16 2023 6:06 AM

-

● నామినేషన్‌ ఉపసంహరించుకున్న 57 మంది అభ్యర్థులు ● స్వతంత్రులు, చిన్న పార్టీలకు గుర్తుల కేటాయింపు ● తప్పుకున్న ఉమ, కటకం, నల్ల, నాగి ● చాలాచోట్ల త్రిముఖ పోటీ!

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నామినేషన్ల స్క్రూటినీ పూర్తయింది. 12 నియోజకవర్గాల్లో మొత్తం 216 మంది పోటీలో ఉండగా.. 57 మంది తమ నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. జాతీయ, స్థానిక పార్టీల నుంచి పలువురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు ఈసారి బీఎస్పీ, ఏఐఎఫ్‌బీ లాంటి పార్టీల నుంచి బరిలో ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతీ నియోజకవర్గంలో కనీసం మూడు పార్టీలు బరిలో ఉన్నాయి. గతంలో బీజేపీకి సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఈసారి మాత్రం దాదాపు అన్నిచోట్ల బలమైన కేండిడేట్లు ఉన్నారు. మూడు బలమైన పార్టీలు ఉండటంతో త్రిముఖ పోరు తప్పేలా లేదు. మరోవైపు ఆర్వోలు ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలకు డ్రా సిస్టమ్‌ ద్వారా గుర్తులను కేటాయించారు. దీంతో స్వతంత్రులందరూ తమకు కేటాయించిన గుర్తులతో ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీలన్నీ అగ్రనేతలతో భారీ బహిరంగ సభలకు, కార్నర్‌ మీటింగులకు ఇప్పటికే అనుమతులు తీసుకున్నాయి.

తప్పుకున్న వారిలో బంధువులే అధికం

నామినేషన్‌ ఉపసంహరించుకున్న వారిలో అధికంగా ప్రధాన పార్టీలకు చెందిన డమ్మీ కేండిడేట్లు, అక్కడక్కడా అసంతృప్తులు ఉండటం గమనార్హం. స్వచ్ఛందంగా తప్పుకున్న వారిలో మంత్రి కమలాకర్‌ సతీమణి గంగుల రజిత, ఆది శ్రీనివాస్‌ భార్య వనజ ఉన్నారు. ఇక బీఫాం ఇవ్వకపోవడంతో తిరస్కరణకు గురైన వారిలో మంథని నుంచి పుట్ట మధు సతీమణి శైలజ, చల్లా నారాయణ రెడ్డి సతీమణి సుజాత, పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్‌రెడ్డి కోడలు మమతారెడ్డి, కరీంనగర్‌ నుంచి పురమళ్ల శ్రీను సతీమణి లలిత, మానకొండూరులో కవ్వంపల్లి సత్యనారాయణ సతీమణి అనురాధ, కోరుట్లలో కె.సంజయ్‌ తండ్రి విద్యాసాగర్‌రావు ఉన్నారు. చొప్పదండిలో కాంగ్రెస్‌ రెబల్‌ నాగి శేఖర్‌, పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ రెబెల్‌ నల్ల మనోహర్‌రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. సిరిసిల్ల నుంచి స్వతంత్ర అభ్యర్థి కటకం మృత్యుంజయం, వేములవాడ నుంచి బీజేపీ టికెట్‌ ఆశించి భంగపడ్డ తుల ఉమ పోటీ నుంచి వైదొలిగారు.

ఏడుచోట్ల డబుల్‌ ఈవీఎంలు

ఉమ్మడి జిల్లాలో మొత్తం ఏడుచోట్ల డబుల్‌ ఈవీఎంలు వచ్చే అవకాశాలున్నాయి. సాధారణంగా ఒక ఈవీఎంలో గరిష్టంగా 16 గుర్తులు (నోటాతో కలిపి) కేటాయించే వీలుంది. ఒకవేళ అభ్యర్థులు 15 మంది దాటితే.. రెండో ఈవీఎం వినియోగం అనివార్యమవుతుంది. చొప్పదండి, మానకొండూరు, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాల్లో సింగిల్‌ ఈవీఎం వినియోగించనున్నారు. ఇందులో చొప్పదండి, మానకొండూరు, ధర్మపురి ఎస్సీ నియోజకవర్గాలు. ఇక మిగిలిన కరీంనగర్‌, హుజూరాబాద్‌, రామగుండం, మంథని, పెద్దపల్లి, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 15 మందికి మించి ఉండటంతో ఇక్కడ రెండో ఈవీఎం తప్పనిసరి.

నియోజకవర్గాల వారీగా సమాచారం

నియోజకవర్గం బరిలో విత్‌డ్రా

కరీంనగర్‌ 27 04

హుజూరాబాద్‌ 22 11

చొప్పదండి 14 03

మానకొండూరు 10 03

సిరిసిల్ల 21 02

వేములవాడ 16 04

పెద్దపల్లి 17 08

మంథని 21 03

రామగుండం 23 03

జగిత్యాల 15 04

కోరుట్ల 15 05

ధర్మపురి 15 03

మొత్తం 216 57

 
Advertisement
 
Advertisement