
● జిల్లా ఏర్పాటు నుంచే పెద్దపల్లికి ప్రత్యేక గుర్తింపు
● తొమ్మిది అంశాల్లో పోటీపడుతున్న గ్రామాలు
● రాష్ట్రస్థాయిలో ఎంపికైన లక్ష్మీపూర్, గంగారం, సుల్తాన్‌పూర్
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లాకు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాగా ఆవిర్భావం నుంచి కేంద్రం నిర్వహించే పోటీల్లో పాల్గొంటూ ప్రత్యేకత చాటుకుంటూ.. అవార్డులు అందుకుంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన తొమ్మిది అంశాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. ఇందులో జిల్లాలోని 27 పంచాయతీలు అవార్డులు అందుకున్నాయి.
రాష్ట్రస్థాయిలో సుల్తాన్‌పూర్
ఎలిగేడు: మండలంలోని సుల్తాన్‌పూర్ పంచాయతీ థీమ్ 1, 2, 5, 9 అంశాల్లో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయిలో నిలిచింది. ఉపాధిహామీ పథకం, పీఎం కిసాన్, రేషన్ కార్డుదారులకు లబ్ధి, పీఎం జన్‌ధన్ యోజన, స్వశక్తిసంఘాలకు నూరుశాతం రుణాలందించేలా కృషి చేశారు. ఆరోగ్య సేవల్లోనూ ముందంజలో ఉంది. పచ్చదనం, పరిశుభ్రతలో ప్రత్యేకత చాటుకుంది. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపి రక్తహీనత నియంత్రించడంలో కీలకంగా వ్యవహరించింది.
సమన్వయంతో ముందుకు
గ్రామంలోని ప్రజలందరి జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. స్థానికంగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం ఉపాధిమార్గాలు చూపి ప్రోత్సహిస్తున్నాం. అందరి సహకారంతోనే గ్రామానికి ప్రత్యేక గుర్తింపు దక్కింది.
– వెంకటేశ్వర్‌రావు, సర్పంచ్, సుల్తాన్‌పూర్
