పూసపాటిరేగ: విశాఖపట్నంలో డిసెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వాగతం పలికారు. ఈ మేరకు భోగాపురంలోని అల్లూరిసీతారామరాజు ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో బుధవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
ఛత్‌పూజకు ప్రత్యేక రైళ్లు
విజయనగరం టౌన్: ఛత్ పూజ పండగ సందర్భంగా సౌత్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లను కేటాయించినట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైలు నంబర్ 06115 ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–బరౌని ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ఈ నెల 12న గురువారం రాత్రి 23.50 గంటలకు ఎంజీఆర్ సెంట్రల్ నుంచి బయలుదేరుతుంది. ఇది మరుసటిరోజు మధ్యాహ్నం 13.50గంటలకు దువ్వాడ, సాయంత్రం 5 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. రాత్రి 8గంటలకు పలాస, శనివారం రాత్రి 8 గంటలకు బరౌని చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 06116 బరౌని–చైన్నె ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ఈ నెల 16న సోమవారం రాత్రి 9 గంటలకు బరౌని నుంచి బయలుదేరుతుంది. మంగళవారం రాత్రి 21.15 గంటలకు పలాస, రాత్రి 11.30 గంటలకు విజయనగరం చేరుతుంది. దువ్వాడ 2.32 గంటలకు బుధవారం సాయంత్రం 18.30 గంటలకు చైన్నె బీచ్ చేరుకుంటుందని వివరించారు.
పతివాడబర్రిపేటలో ఇల్లు దగ్ధం
పూసపాటిరేగ: మండలంలోని పతివాడ బర్రిపేటలో ఓ ఇల్లు పాక్షికంగా దగ్ధమైంది. గ్రామంలోని ఓ ఇంట్లో దేవుడి గదిలో దీపాన్ని ఎలుక తీసుకెళ్లడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు బాధిత కుటుంబసబ్యులు తెలియజేశారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే గ్రామస్తులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సంఘటనా స్థలాన్ని పోలీసు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు.
రైలు ఢీకొని వైద్యుడి మృతి
చీపురుపల్లి: పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని నెలిమర్ల మండలంలోని మొయిద నారాయణపట్నం గ్రామానికి చెందిన అనస్థీషియా వైద్యు డు గాసాడ బాలకృష్ణ(49) మృతి చెందారు. దీనిపై జీఆర్‌పీ హెచ్‌సీ మధుసూదనరావు మాట్లాడుతూ విజయనగరంలోని ఘోషా ఆస్పత్రిలో అనస్థీషియా వైద్యుడిగా పని చేస్తున్న బాలకృష్ణ తన భార్య గౌతమి పిల్లలతో కలిసి మంగళవారం రాత్రి చీపురుపల్లిలో ఉన్న తన మేనకోడలు ఇంటికి వచ్చారు. తిరిగి బుధవారం ఉదయం విజయనగరంలో విధులు నిర్వహించేందుకు చీపురుపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లిన ఆయన పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.
గడ్డిమందు తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం
పార్వతీపురం రూరల్: వ్యవసాయ పనుల్లో సాయం చేయాలని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మండలంలోని పిండిలోవ గ్రామానికి చెందిన మెల్లిక మున్నా అనే యువకుడిని వ్యవసాయ పనులకు వెళ్లాలని తండ్రి కోరాడు. పని చేయడం ఇష్టం లేక తండ్రితో విసుక్కున్న సదరు యువకుడు, ఇంట్లో ఎవరూ లేని సమయంలో సమీపంలోని తన పెద్దమ్మ ఇంటి వద్దకు వెళ్లి యూరియా, పురుగు మందు, గడ్డిమందు కలిపి తాగేశాడు. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన మధ్యాహ్నం 12 గంటల సమయంలో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కాగా, యువకుడు తీసుకున్న పురుగుల మందుల ప్రభావాన్ని పరిశీలించిన కేంద్ర ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించి పర్యవేక్షణలో ఉంచారు.


