● నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాధవ్‌రెడ్డి
● ప్రతిభ కనబరిచిన పోలీసులకు
ప్రశంసాపత్రాలు అందజేత
పార్వతీపురం రూరల్: జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తగిన భద్రత, ముందస్తు బందోబస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. ఈ మేరకు బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో మాసాంతపు నేర సమీక్షా సమావేశం జరిగింది. రెండు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల నామినేషన్లు, ఒకేరోజు నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై నిఘా ఉంచి, అల్లర్లకు పాల్పడే వారిపై ముందస్తు బైండోవర్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల అభియోగ పత్రాలను త్వరితగతిన కోర్టుల్లో దాఖలు చేయాలని, పోక్సో, డిజిటల్ అరెస్ట్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. ఐరాడ్ తదితర అప్లికేషన్లలో ప్రమాదాల వివరాలను సకాలంలో నమోదు చేయాలన్నారు. అనంతరం గంజాయి అక్రమ రవాణా అరికట్టడం, పెండింగ్ కేసుల ఛేదనలో ప్రతిభ కనబరిచిన 20 మంది సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో డీఎస్పీలు శేషయ్య, రాంబాబు, థామస్ రెడ్డి, సీఐలు తదితరులు పాల్గొన్నారు.


