మక్కువ: మండల కేంద్రం మక్కువలో వాడవాడలా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల గెలుపు సంబరాలను అభిమానులు జరుపుకుంటున్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక కూరాకుల వీధి, మేదరవీధి, నక్కలవీధి, పొందూరువీధి, దిగువ కూరాకులవీధి, కిలారివీధుల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు గెలుపు సంబరాలు నిర్వహించారు. విజయోత్సవ సంబరాలకు అభిమానుల ఆహ్వానం మేరకు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మావుడి రంగునాయుడు హాజరు కాగా దుశ్శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రంగునాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానం ఎన్నడు మర్చిపోలేనివన్నారు. మీరు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని అన్ని విధాలా గుర్తుంచుకుని మీకష్ట సుఖాల్లో తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించి, మనం ఎన్నుకోనున్న అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.


