సాలూరు: పరిషత్ ఎన్నికల వేళ ఆంధ్రా, ఒడిశా వివాదాస్పద కొఠియా గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. వివాదాస్పద కొఠియా గ్రూప్ గ్రామాలకు ఎన్నికల భద్రత కోసం వెళ్లిన ఏపీ పోలీసులను ఒడిశా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొఠియా సరిహద్దు గ్రామాల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆంధ్రాలో పరిషత్ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఎప్పటిలాగానే కొఠియా గ్రూప్ గ్రామాల్లోను ఈ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు.ఈ ఎన్నికలను అడ్డుకోవడానికి ఒడిశా ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. గడిచిన వారం రోజులు ముందుగానే కొఠియా గ్రామాలకు ముఖద్వారమైన నేరెళ్లవలస సంతవద్ద ఒడిశా పోలీసులు అవుట్‌పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆంధ్రా ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ బియ్యం లారీని సైతం అడ్డుకున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా భద్రత కోసం వెళ్తున్న కొఠియా సీఐ దశరథ్, ప్రత్యేక బృందం ఏఎస్సై సత్యనారాయణ తదితరులను మంగళవారం ఒడిశా పోలీసులు నేరెళ్లవలస వద్ద బారికేడ్లు అడ్డుగా పెట్టి నిలువరించారు. దీంతో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది స్టేటస్‌కో అమలులో ఉన్న ప్రాంతమని, మేమెప్పుడూ ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మీ అభ్యంతరం ఏమిటని కొఠియా సీఐ దశరథ్ ఒడిశా పోలీసులను ప్రశ్నించారు. కాగా ఆంధ్రా పోలీసులను అడ్డుకోవడంతో స్థానిక పరిసర కొఠియా గ్రూప్ గ్రామాలైన దొర్లతాడివలస, మూలతాడివలస, నేరెళ్లవలస తదితర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తును సంఘటనా స్దలానికి చేరుకుని ఒడిశా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు తొలగించి, ఒడిశా గోబ్యాక్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఒడిశా పోలీసులు వారి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద ఎత్తున పోలీసులు, వారి వెంట కొందరు ఒడిశా వాసులు వచ్చారు. వారు ఆంధ్రా పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొద్దిసేపు తోపులాట జరిగింది.
సంయమనం పాటించినప ఆంధ్రా పోలీసులు
అధిక సంఖ్యలో ఒడిశా పోలీసులు ఉండడం, స్వల్ప సంఖ్యలో ఆంధ్రా పోలీసులు ఉండడంతో ఆంధ్రా పోలీసులు సంయమనం పాటించారు. ఇది ఒడిశా భూభాగమని ఇక్కడ ఎన్నికలు నిర్వహించరాదంటూ ఒడిశా వాసులు నినాదాలు చేశారు. ఈ విషయాన్ని ఆంధ్రా పోలీసులు వారి ఉన్నతాధికారులకు తెలియచేయడంతో ఆంద్రా నుంచి ప్రత్యేక బలగాలు నేరెళ్లవలసకు చేరుకున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంలో తడుస్తూనే ఇరు రాష్ట్రాల పోలీసులు, అధికారులు ఉన్నారు. ఒడిశా నుంచి కొరాపుట్ సబ్‌కలెక్టర్ హబిరషీధ్, ఆంధ్రా నుంచి పార్వతీపురం సబ్‌కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్, డీఎస్పీ శేషయ్యలు మంగళవారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని చర్చలు జరుపుతున్నారు.
స్వేచ్ఛగా ఓటు వేసేలా చేయాలి
ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులు దూకుడుగా ఉన్న నేపథ్యంలో ఆంధ్రా ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోవడం లేదని ఈ గ్రామాల గిరిజనులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పూర్తిస్థాయిలో తమకు భద్రత కల్పించి, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రా ప్రభుత్వాన్ని కొఠియా గ్రూప్ గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.
ఏపీ పోలీసులను అడ్డుకున్న ఒడిశా పోలీసులు
ఆంధ్రా, ఒడిశా పోలీసుల మధ్య తోపులాట
ఒడిశా గో బ్యాక్..ఆంధ్రా గో బ్యాక్ అంటూ ఇరు పక్షాల నినాదాలు


