డివైడర్‌ను ఢీకొట్టిన లారీ | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొట్టిన లారీ

Nov 4 2026 2:08 AM | Updated on Nov 4 2026 2:08 AM

● ఒరిగిపోయిన పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌

గజపతినగరం: మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఓ లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. విజయనగరం నుంచి సాలూరు వైపు వెళ్తున్న లారీ గజపతినగరం చేరుకునేసరికి ఒక్క సారిగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో జనసంచారం లేక పోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఎంపీడీఓ కార్యాలయంలో పాము

గుమ్మలక్ష్మీపురం: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రూమ్‌లో మంగళవారం సుమారు 7 అడుగుల పాము (జెర్రిపోతు) ఆందోళన సృష్టించింది. ఆ రూమ్‌లోకి ఎప్పుడొచ్చి దూరిందో గానీ, కార్యాలయం సిబ్బంది మధ్యాహ్నం ఆ రూం తలుపులు తెరవగానే కిటికీలోంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. కిటికీలకు మెస్‌ బిగించి ఉండడంతో వెళ్లలేక ఆ రూమ్‌ వద్దే మూలన నక్కింది. సిబ్బంది తలుపులన్నీ తెరిచి వెనుకవైపు నుంచి తోలడంతో తలుపు మార్గం గుండా బయటికి వెళ్లిపోయింది. దీంతో అక్కడి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

బాలిక అత్మహత్య..

హైదరాబాద్‌: జిల్లాలోని జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పార్వతీపురానికి చెందిన రమ, హరికృష్ణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా చిన్న కుమార్తె లావణ్య(15)తో కలిసి సంవత్సరం నుంచి నగరంలోని కుత్బుల్లాపూర్‌ బోళాశంకర్‌ నగర్‌లో ఉంటున్నారు. మూడు రోజుల క్రితం దంపతులు పని నిమిత్తం స్వగ్రామానికి వెళ్తూ లావణ్యను పిన్ని ఉమ ఇంట్లో ఉంచారు. కాగా లావణ్య కుత్బుల్లాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో 9వ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన బాలిక సాయంత్రం పిన్ని ఇంటికి వెళ్లకుండా బోళాశంకర్‌నగర్‌ లోని వారు ఉంటున్న ఇంటికి వెళ్లింది. బాలిక లోపలి నుంచి తలుపు గడియ పెట్టుకుని ఉండడాన్ని గమనించిన ఇంటి యజమానురాలు శోభ తలుపు తట్టగా ఎంతకూ తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె బాలిక పిన్నికి సమాచారం అందించింది. వెంటనే ఆమె ఇంటికి వచ్చి చుట్టు పక్కల వారి సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా బాలిక చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ మృతిచెంది ఉంది. బాలిక పిన్ని ఉమ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రివాల్వర్‌తో కాల్చుకుని జవాన్‌ ఆత్మహత్య

మెళియాపుట్టి: భారత సైన్యంలో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తూ మరికొద్ది నెలల్లో ఉద్యోగ విరమణ చెంది కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన ఆర్మీ జవాన్‌ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మెళియాపుట్టి మండలంలో చోటుచేసుకుంది. చాపర గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ నక్క నారాయణరావు(40) ఆదివారం జమ్మూకాశ్మీర్‌లో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి గల కారణాలు తెలియలేదు. నారాయణరావుకు భార్య హైమావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం చాపర గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

బొలెరోను ఢీకొన్న లారీ

మందస: బాలిగాం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి అరటి పండ్ల లోడుతో ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బొలెరో వాహనం రాజమండ్రి నుంచి ఒడిశాకు వెళ్తుండగా టైరు పంక్చర్‌ కావడంతో రోడ్డు పక్కన ఆపి ఉంచగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement