● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
● అత్యవసర ద్వారం నుంచి
బయటపడ్డ ప్రయాణికులు
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట గ్రామ సమీపాన ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. రావులపాలెం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం తేటగుంట సమీపాన ముందు వెళ్తున్న లారీని ఢీకొని, అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న కాలువలోకి ఒరిగిపోయింది. సాధారణ ద్వారం నుంచి బస్సు దిగే అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు అత్యవసర ద్వారం, డ్రైవర్ సీటు పక్కన ఉన్న డోర్ నుంచి బయట పడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. మురసు తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షంతో రహదారి కనిపించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రయాణికులను కండక్టర్, డ్రైవర్లు ఇతర ఆర్టీసీ బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు. ఈ సంఘటనపై ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని తుని రూరల్ పోలీసులు తెలిపారు.


