కండువాల సంచి నిండితే..
పార్టీ బలపడినట్టేనా...
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
సాక్షి, పార్వతీపురం మన్యం : ‘అయ్యో సామీ..! ఇదేం రాజకీయం బాబూ.. కండువా చేతిలో ఉంటే చాలు, కనిపించినోళ్ల భుజాల మీద వేసేయడమేనా? కండువా కప్పిన మరుక్షణమే పార్టీ బలం పెరిగిపోయినట్టా? ఫొటో దిగిన వెంటనే కొత్త నాయకుడు పుట్టుకొచ్చినట్టా? మరీ ఇంత సులువైపోయిందా రాజకీయమయ్యా సామీ!’
సాలూరులో తెలుగుదేశం పార్టీ చేరికల వ్యవహారంపై సాగుతున్న ప్రచారం ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. పార్టీలోకి ప్రముఖ నాయకులు వస్తే అదో రాజకీయ పరిణామం. ప్రజల్లో పలుకుబడి ఉన్నవారు చేరితే అదో బలమైన సంకేతం. కానీ, ఎవరికి కండువా కప్పారు.. ఎంతమంది ఫొటోల్లో కనిపించారు.. అంటూ లెక్కలు పెంచుకుంటూ పోతే, అది రాజకీయ బలమా? లేక కండువాల వ్యాపారమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
చిరుద్యోగులకూ రాజకీయ పట్టాభిషేకమా?
పెద్ద నాయకులు, ప్రజాబలం ఉన్నవారు పార్టీలో చేరితే ప్రచారం చేసుకోవడంలో తప్పులేదు. నియోజకవర్గంలో చిరుద్యోగులు సహా ఎవరికి పడితే వారికి కండువాలు కప్పుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు చేరికల ప్రమాణాలేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎవరైనా నిజంగా పార్టీలో చేరితే అది వారి నిర్ణయం. కానీ, కేవలం ఫొటో ఆధారంగా వారి రాజకీయ అనుబంధాన్ని ఖరారు చేయడం ఎంతవరకు సమంజసం అన్నదే అసలు ప్రశ్న. పలువురు చిరుద్యోగులను సైతం భయపెట్టి, మభ్యపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.
చేరికల ఫొటోలు వంద.. ప్రజాబలం ఎంత?
అసలు రాజకీయమంటే ఫొటోల సంఖ్య కాదు సామీ.. ప్రజలతో ఉన్న సంబంధం! సభకు వచ్చిన జనాన్ని చూపించి బలం చెప్పుకోవడం ఒక ఎత్తు.. సమస్య వచ్చినప్పుడు ప్రజల పక్కన నిలబడటం మరో ఎత్తు. నలుగురికి కండువాలు కప్పి, పది మందిని చేర్చుకున్నామని చెప్పుకోవడం సులువే. ఆ పది మందిలో ఎంతమంది పార్టీ కోసం కష్టపడతారు? ఎంతమంది ప్రజల్లో పని చేస్తారు? ఎంతమంది పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటారు? అన్నది కాలమే తేల్చాలి. కండువాల లెక్కల్లో క్యాడర్ పెరగొచ్చు.. ఫొటోల లెక్కల్లో నాయకులు పెరగొచ్చు.. ప్రజల నమ్మకం మాత్రం ప్రకటనలతో పెరగదు! దానికి పని చేయాలి, ప్రజల్లో ఉండాలి, వారి సమస్యలకు పరిష్కారం చూపాలి. ఆ పని పక్కనపెట్టి కండువాల లెక్కలే రాజకీయమని భావిస్తే.. ప్రచార కార్యాలయంలో పండగే గానీ ప్రజల్లో పలుకుబడి పెరుగుతుందన్న గ్యారంటీ లేదు.
ఒక కండువా తీసుకురావాలి.. నలుగురికి కప్పాలి.. ఐదుగురితో ఫొటో దిగాలి.. ఆ తర్వాత పెద్ద ఎత్తున చేరికలు జరిగిపోయాయని ప్రచారం చేసుకోవాలి! ఇప్పుడు సాలూరు నియోజకవర్గంలోని టీడీపీలో జరుగుతున్న తంతు ఇదీ. మరి ఇదే లెక్క అయితే, ఒక కండువాను పది మందికి మార్చిమార్చి కప్పితే పార్టీ బలం పదింతలు పెరిగిపోతుందా ఏందయ్యా?! అని జనం నవ్వుకుంటున్నారు. ‘పార్టీలో చేరికలంటే అంత చులకనా? కండువా భుజం మీద పడిన ప్రతివారూ పార్టీ కోసం పని చేస్తారా? ఫొటోలో నవ్వుతూ నిలబడిన ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలోనూ అదే ఉత్సాహంతో నిలబడతారా? ఇవన్నీ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలే..’ అని చర్చించుకుంటున్నారు. కండువా కప్పడం ఒక నిమిషం పని.. కార్యకర్తగా నిలబడటం మాత్రం నిరంతర కష్టం. ఈ తేడా తెలియకుండా చేరికల లెక్కలతో కాలర్ ఎగరేస్తే, రాజకీయాల్లో కామెడీ పండించడమే తప్ప బలం పెరిగినట్టు కాదన్నది విమర్శకుల మాట.
కండువా కప్పితే క్యాడర్ అయిపోయినట్టేనా సామీ!
సాలూరు టీడీపీలో చేరికల జాతరా..
కండువాల లెక్కలతోనే రాజకీయ బలమా..
ఫొటోలకు ఫోజులు.. ప్రచారానికి హడావుడి.. అసలు బలమెంతో తేల్చేది ప్రజలే..


