నేడు తొలేళ్ల ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు తొలేళ్ల ఉత్సవం

Oct 26 2026 2:46 AM | Updated on Oct 26 2026 2:46 AM

నేడు తొలేళ్ల ఉత్సవం

వేలాదిగా తరలిరానున్న భక్తజనం

భక్తి పారవశ్యంలో విజయనగరం

ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోతున్న నగరం

రేపటి సిరిమానోత్సవానికి పక్కా ఏర్పాట్లు

పైడితల్లి ఉత్సవానికి సర్వం సిద్ధం

సిరిమానోత్సవం రేపు

విజయనగరం కల్చరల్‌ (క్రైమ్‌):

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, శరణుకోరిన భక్తుల కొంగుబంగారం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు విజయనగరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. నెల రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతర మహోత్స వాల్లో అత్యంత ప్రధానమైన ‘తొలేళ్లు’, ‘సిరిమానోత్సవం’ ఘట్టాలకు వేళైంది. సుమారు మూడున్నర లక్షల నుంచి ఐదు లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనార్థం తరలివస్తారని అంచనా వేస్తుండడంతో అధికారులు, ఆలయ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు. 1700వ సంవత్స రం నాటి చారిత్రక విజయనగరం కోటతో పాటు గంటస్తంభం, మూడు లాంతర్ల కూడలి, ప్రధాన రహదారులన్నీ మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ కాంతులతో విరాజిల్లుతున్నాయి. నగరమంతా అమ్మ వారి నామస్మరణతో మారుమోగుతూ పండగ వాతావరణం సంతరించుకుంది.

నేటి రాత్రే భవిష్యవాణి

ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ‘తొలేళ్ల’ (తొలి ఏరు) పండుగను అత్యంత నిష్ఠతో నిర్వహించనున్నారు. భక్తులు వారు మొక్కుకున్న విధంగా విచిత్ర వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. మరికొందరు ఘటాలతో ఊరేగింపుగా వెళ్తూ దర్శించి మొక్కు తీర్చుకుంటారు. జిల్లాలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ అమ్మ వారికి విశేష పూజలు చేస్తారు. ఈ సందర్భంగా చదురుగుడి నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాల ను, పవిత్ర ఘటాలను ఊరేగింపుగా తీసుకెళ్తారు. మూడులాంతర్ల కూడలి నుంచి కోటలో కొలువైన మూర్తులకు మూడుసార్లు మొక్కిస్తూ కోటకు చేర్చి, అక్కడే పవిత్ర పూజలు నిర్వహిస్తారు. గడిచిన 300 ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం సోమవారం రాత్రి కోట వద్ద అమ్మవారు పూజారి ద్వారా స్వరం పలికి, రాబోయే ఏడాది కాలంలో జిల్లాలో వర్షపాతం, పంటల దిగుబడిపై ‘భవిష్యవాణి’ వినిపిస్తారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

నాలుగు దశాబ్దాలుగా...

పూజారి బంటుపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, అమ్మవారి కరుణాకటాక్షాలతోనే తమ కుటుంబం 40 ఏళ్లుగా సిరిమాను సేవలో తరిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఉత్సవాల మహిమతో జిల్లా వ్యాప్తంగా విరివిగా వర్షాలు కురిసి, పంట లు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

భక్తులందరికీ ఉచిత దర్శనం

ఉత్తరాంధ్రతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, అందరికీ సులభంగా అమ్మవారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈఓ శిరీష తెలిపారు. ఈ నెల 26, 27 తేదీలలో రూ.50, రూ.100 ప్రత్యేక దర్శన టిక్కెట్లను రద్దు చేశామని, భక్తులందరికీ పూర్తి ఉచిత దర్శనం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. వేలాది మంది భక్తులు నేరుగా అమ్మవారిని దర్శించుకునేలా క్యూలు, మంచినీరు, పారిశుధ్య ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.

జాతరలో అత్యంత కీలకమైన ‘సిరిమానోత్సవం’ తరలించే ఏర్పాట్లు మంగళవారం ఉద యం నుంచే ప్రారంభం కానుంది. హుకుంపేటలోని ఆలయ అనువంశిక పూజారి బంటుపల్లి వెంకటరావు నివాసం వద్ద సిద్ధమైన 60 అడుగుల పవిత్ర చింతమాను (సిరిమాను)తో పాటు అంజలి రథం, పాలధార, చేపల వల, తెల్ల ఏనుగు రథాలు ఉదయం 10 గంటలకే చదురుగుడికి చేరుకుంటాయి. నాటి రాజుల వైభవాన్ని, రాజరికపు ఠీవిని నేటి తరానికి చాటిచెప్పేలా తెల్ల ఏనుగు రథాన్ని దాదాపు 300 ఏళ్లుగా ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రథాలను రణస్థలా నికి చెందిన రమణ కుటుంబీకులు గడచిన 40 ఏళ్లుగా ఎంతో నిష్ఠతో తయారు చేస్తున్నారు. ఆ రోజు ఉద యం అమ్మవారి వేషధారణలో పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానుపై అధిరోహించి భక్తులకు అభయమిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement