ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి ● పీఓలు, ఏపీఓల శిక్షణలో కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి

శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, మాట్లాడుతున్న కలెక్టర్‌ డా.ఎన్‌ ప్రభాకరరెడ్డి

పార్వతీపురం రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్‌ అధికారులు (పీఓ), అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు (ఏపీఓ) ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎనన్‌.ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు గురువారం స్థానిక లయన్స్‌ క్లబ్‌ కల్యాణ మంటపంలో ఎన్నికల సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రంలో జరిగే ప్రతి కార్యకలాపానికి పీఓదే పూర్తి బాధ్యత అని, కాబట్టి వారి వద్ద మాత్రమే మొబైల్‌ ఫోన్‌ ఉండాలని స్పష్టం చేశారు. ఏపీఓలు, ఇతర సిబ్బందికి ఫోన్లకు అనుమతి లేదన్నారు. దొంగ ఓట్లను నివారించేందుకు ఓటరు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని, వేలికి వేసిన సిరా గుర్తు ఆరిన తర్వాతే ఓటింగ్‌కు అనుమతించాలని సూచించారు. పోలింగ్‌ రోజున సిబ్బంది గంట ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలను ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం మార్గదర్శకాలకు లోబడి పూర్తి చేయాలన్నారు. పీఓ హ్యాండ్‌బుక్‌ను ఆసాంతం చదివి, విధుల్లో సొంత అభిప్రాయాలకు తావులేకుండా నిబంధనల ప్రకారమే విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినా, పక్షపాతంగా వ్యవహరించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్వతీపురం మున్సిపల్‌ కమిషనర్‌ బి.రామ్‌గోపాల్‌, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement