అవగాహన కల్పిస్తున్నాం
హెచ్‌ఐవీపై కళాశాలలు, గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. హెచ్‌ఐవీ ఏ విధంగా సోకుతుంది, సోకకుండా ఏవిధమైన జాగ్రత్తలు పాటించాలనే అంశాలపై తెలియజేస్తున్నాం. నిర్లక్ష్యంగా వ్యవహరించి జీవితాలను నాశనం చేసుకోకూడదు. – డాక్టర్ కె.రాణి,
జిల్లా ఎయిడ్స్, క్షయ, కుష్ఠు నివారణ అధికారి
విజయనగరం ఫోర్ట్: విజయనగరం పట్టణానికి చెందిన 26 ఏళ్ల యువకుడికి కొద్ది నెలల క్రితం వివాహమైంది. ఒంట్లో బాగాలేదని ఆస్పత్రికి వెళ్తే ఆ యువకుడికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పెళ్లయిన కొద్ది నెలలకే భర్తకు హెచ్‌ఐవీ సోకడంతో ఆమె పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. నెల్లిమర్లమండలానికి చెందిన 25 ఏళ్ల యువకుడి జ్వరం వస్తోందని ఆస్పత్రికి వెళ్తే నిర్వహించిన వైద్య పరీక్షల్లో హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ యువకుడికి ఇంకా వివాహం కూడా కాలేదు. దీంతో ఆ యువకుడితో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ ఇద్దరు యువకులే కాదు అనేకమంది అలసత్వం కారణంగా.. కొంతమంది అవగాహన లేక హెచ్‌ఐవీ బారిన పడుతున్నారు. హెచ్‌ఐవీ బారిన పడితే జీవితం అంధకారం అవుతుందని తెలిసినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెడు సావాసాలు, సురక్షితం కాని లైంగిక అలవాట్లతో యువత ఎక్కువగా ఎయిడ్స్ మహమ్మారి బారిన పడుతున్నారు. నిర్లక్షరాస్యుల కంటే అక్షరాస్యులే వ్యాధిబారిన పడినవారిలో అధికశాతంమంది ఉంటున్నారు. 15 నుంచి 35 ఏళ్ల వయసు మధ్య వయసు గల వారు హెచ్‌ఐవీ బారిన పడిన వారిలో ఎక్కువగా ఉండడం ఆందోళన కల్గిస్తున్న అంశం. హెచ్‌ఐవీ సోకిన వారిలో సహజంగానే వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. వ్యాధి బారిన పడిన వారు ఏఆర్‌టీ కేంద్రం నుంచి తీసుకున్న మందులు వాడుతూ మంచి పౌష్టికాహారం తీసుకుంటే జీవితకాలం పెంచుకోవచ్చు. అయితే కొందరు మానసికంగా కుంగిపోయి ప్రాణాలు విడుస్తున్నట్లు వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఐదు నెలల్లో 153 మందికి హెచ్‌ఐవీ వ్యాప్తి
ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలవరకు జిల్లాలో 153 మంది హెచ్‌ఐవీ బారిన పడ్డారు. వారిలో 149 మంది సాధారణ వ్యక్తులు కాగా, నలుగురు గర్భిణులు ఉన్నారు. 2025 –26 లో 307 మంది హెచ్‌ఐవీ బారిన పడ్డారు. అదేవిధంగా 10 మంది గర్భిణులకు కూడా హెచ్‌ఐవీ సోకింది.
ఏఆర్‌టీ కేంద్రంలో రిజిస్టర్ అయిన
రోగులు 6857 మంది
హెచ్‌ఐవీ సోకిన రోగులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న ఏఆర్‌టీ కేంద్రంలో నమోదు చేసుకుంటారు. అలా రిజిస్టర్ చేసుకున్న వారు జిల్లాలో 6857 మంది ఉన్నారు. వారిలో పురుషులు 2,989 మంది, మహిళలు 3862 మంది, ట్రాన్స్‌జెండర్స్ ఆరుగురు ఉన్నారు. 15 ఏళ్లలోపు వారు 43 మంది ఉన్నారు. వారిలో పురుషులు 23 మంది, మహిళలు 20 మంది. 15 నుంచి 35 ఏళ్ల లోపు వారు 1125 మంది ఉన్నారు. వారిలో పురుషులు 507 మంది, మహిళలు 614 మంది, ట్రాన్స్‌జెండర్స్ నలుగురు ఉన్నారు. 35 ఏళ్లు, అపైన వయసుగలవారు 5689 మంది ఉన్నారు. వారిలో పురుషులు 2459 మంది, మహిళలు 3228 మంది, ట్రాన్స్‌జెండర్స్ ఇద్దరు ఉన్నారు.
నిర్లక్ష్యం వీడని యువత
హెచ్‌ఐవీ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా యువత
జిల్లాలో 6857మంది రోగులు


