విజయనగరం రూరల్: జిల్లా కేంద్రం శివారు ఏపీ కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో హిందీ పక్షోత్సవాల ముగింపు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అమర్ కంటక్ ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం డీన్ హిందీ విభాగం ఆచార్యులు రేణు సింగ్ మాట్లాడుతూ వైవిధ్యం దేశ సమృద్ధి సాంస్కృతిక వారసత్వానికి దేశభాష ప్రతీక అని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల ప్రజల మధ్య సంభాషణ సాంస్కృతిక పరస్పర మార్పిడిని ప్రోత్సహించడంలో హిందీ భాష ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు. విద్యార్థులు హిందీ భాషతో పాటు హిందీ సాహిత్యాన్ని అధ్యయనం చేసి తన జ్ఞానం ఆలోచన పరిధిని విస్తరించుకోవాలని పిలుపునిచ్చారు. సీటీయూ ఉపకులపతి టి.శ్రీనివాసన్ మాట్లాడుతూ హిందీ కేవలం ఒక భాష మాత్రమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతులు ప్రజలను అనుసంధానించే ముఖ్య వారధి అని అన్నారు విద్యార్థులు దేశంలోని అన్ని భాషలను గౌరవిస్తూ వాటి పరిరక్షణ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలన్నారు. భాషా నైపుణ్యంతో పాటు సాహిత్య సాంస్కృతిక అభిరుచులు పెంపొందించుకోవడం విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. రిజిస్ట్రార్ జితేంద్ర మోహన్ మిశ్రా మాట్లాడుతూ రాజభాషగా హిందీని ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులు హిందీ సాహిత్యం సంస్కృతితో అనుసంధానం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన వారికి మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అనిరుద్ధ కుమార్ గ్రంథాలయ అధికారి కె.శంకర్ రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు ఆచార్యులు పరిశోధకులు విద్యార్థులు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


