పాలకొండ రూరల్:
తుపాను ప్రభావంతో పాలకొండ నియోజకవర్గంలో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. వర్షాలు నిలిచిపోయి మూడు రోజులు గడస్తున్నా నేటికీ పంట భూమూల్లో వరద నీరు పూర్తిగా కదలకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ముఖ్యంగా నాగావళి నదితీరం వెంబడి యరకారాయపురం, చిన్న, గొట్ట మంగళాపురాలు, గోపాలపురం, అన్నవరం, అంపిలి గ్రామాలతోపాటు తంపటాపల్లికి చెందిన రైతులు తమ కష్టాలను తలుచుకుని కన్నీరుపెడుతురున్నారు. సోమవారం నాటికి తంపటాపల్లి గ్రామ శివారులో వందల ఎకరాలు చెరువులను తలపిస్తుండగా అన్నవరం, అంపిలి గ్రామాల్లో వరి చేలు నీటమునిగి కుళ్లిపోయే స్థితికి చేరుకున్నాయి.
గోపాలపురం రెవెన్యూ బౌండరీ పరిధిలో 318 ఎకరాల మేర వరి పేద్యం జరగగా ఈ భూముల్లో బురద, ఇసుక కొంతమేర మేట వేయడంతో అక్కడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వ్యవసాయాధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి, నష్ట నమోదు చేపట్టారు. వాస్తవానికి నిబంధనల అడ్డుంకులు ఉండడంతో రైతులకు న్యాయం జరగడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో ఉన్న పంటలు దక్కించుకునేందుకు సస్యరక్షణకు మరోమారు చేతి మదుపులు పెడుతున్నారు. ప్రభుత్వం నుంచి కచ్చితమైన భరోసా లేదని వాపోతున్నారు.
కన్నీళ్లు వస్తున్నాయి
నేటికీ మా వరి పంటలో నీరు నిలిచే ఉంది. ఎకరాకు రూ.35 వేల వరకూ మదుపు పెట్టాం. 10 ఎకరాల పంట చూస్తుండగానే వరదపాలైంది. పొలం వద్దకు వస్తే కన్నీళ్లు వస్తున్నాయి. నాలాగానే అనేక మంది రైతులు నష్టపోయారు. అధికారులు నష్ట నమోదు చేశారని సహచరులు చెబుతున్నారు. నాకు ఎటువంటి సమాచారం లేదు. దాదాపు రూ.3లక్షలు ఖర్చు చేశాం. ప్రభుత్వం ఆదుకోకుంటే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
– బియ్యాల ఆశోక్, కౌలు రైతు, అన్నవరం గ్రామం
చెరువులను తలపిస్తున్నాయి
మా గ్రామంలో పంట భూములు నేటికీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతోపాటు ఓని గెడ్డ, రావాడ గెడ్డ, తంపర గెడ్డతోపాటు తోటపల్లి ప్రాజెక్టు నుంచి వరద వచ్చి పడడంతో వేలాది ఎకరాల్లో వరి నీట మునిగింది. నాకున్న మూడెకరాల పంట నీటిలో ఉంది. వెదలు జల్లిన రైతులకు చెందిన వరి ప్రస్తుతం పొట్టదశశకు చేరిన తరుణంలో పంటలు నీటమునిగాయి. అధికారులు వచ్చి చూశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి తక్షణ సాయం అందలేదు. నష్ట నమోదుకు నిబంధనలు ఉంటాయని చెబుతున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. నీటిని మళ్లించే అవకాశం లేదు. నాలాంటి పరిస్థితే మా గ్రామంలో అందరి రైతులది.
– టంకాల దుర్గారావు, రైతు, తంపటాపల్లి గ్రామం
వరద కారణంగా నష్టపోయిన పంటను
చూపిస్తున్న మీసాల రామచంద్ర
తీరని నష్టాల్లోకి నెట్టింది..
పాలకొండ మండలం అన్నవరం గ్రామానికి చెందిన మీసాల రామచంద్రరావు 8 ఎకరాల్లో వరి సేద్యం చేస్తున్నారు. కౌలుకు తీసుకున్న భూమిలో ఎకరాకు రూ.30 వేల వరకూ మదుపు పెట్టారు. తొలి దశలో సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డ ఆయనను తపాను తీరని నష్టాల్లోకి నెట్టిందని వాపోతున్నారు. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసి సేద్యం చేశామని, మదుపులకు అప్పులు చేయాల్సి వచ్చిందంటున్నారు. తీరా పంట కీలక దశలో వరద మంపునకు గురై, మట్టి చేరడంతో పాటు చేలు కుళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాడు.


