పూసపాటిరేగ: కర్నూలు జిల్లా ఆదోనిలో అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలకు విజయనగరం జిల్లా తరఫున పూసపాటిరేగ మండలంలోని వెంపడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 20న విజయనగరం అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో వెంపడాం పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఎ.గణేష్ కుమార్ తెలిపారు. ఈ పోటీలలో అండర్ 14 ‘ఎ’ విభాగంలో మిరప ఆదిత్య ప్రథమ స్థానం, అండర్–14 ‘బి’ విభాగంలో మహంతి అరవింద్ ప్రథమ స్థానం, అండర్ 14 ‘ఎ’ విభాగంలో మహంతి యమున ప్రథమ స్థానం సాధించగా, అండర్–16 విభాగంలో 60 మీటర్ల పరుగు పందెంలో వల్లె కీర్తన ద్వితీయస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను మండల విద్యాశాఖాధికారి–2 బి.లచ్చన్న, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.


