● పోలీసుల పహారా నడుమ మొక్కజొన్న పంట ధ్వంసం
● గగ్గోలు పెట్టిన గిరిజన రైతులు ● పంట చేతికొచ్చేవరకు ఆగండయ్యా అంటూ వేడుకోలు
● గిరిజనుల గోడు వినిపించుకోని అధికారులు
● రాధిక వెజిటబుల్స్ పరిశ్రమ వర్గాల ఫిర్యాదుతో గిరిజనులపై ప్రతాపం
● పరిశ్రమ పనులను అడ్డుకున్న రైతులను బాడంగి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
న్యాయం జరిగేవరకు
పోరాటం ఆగదు..
రెవెన్యూ ఉన్నతాధికారులు పెత్తందార్లు ఇచ్చిన ముడుపులకు అమ్ముడు పోయి పోలీసులతో అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు. రెవెన్యూ అధికారులది నూటికినూరు శాతం తప్పు. గిరిజనులు పండించిన పంటలను ధ్వంసం చేయడం దారుణం. వందల పరిశశ్రమలు మూతపడి వేలాది మంది నిరుద్యోగులు వలస వెళ్లిపోతున్నారు. వాటిని తెరింపించే చర్యలు లేకుండా పరిశ్రమలు ఏర్పాటుచేస్తామంటూ సాగు భూములను లాక్కొంటున్నారు. గిరిజన రైతులకు పరిహారంగా జిరాయితీతో సమానమైన భూమి ఇవ్వాలి. వారికి న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదు.
– ఎం.కృష్ణమూర్తి, సీపీఎం జిల్లా నాయుకుడు
సాగు భూమిలో పనులు అడ్డుకుంటూ బైఠాయించిన గిరిజన రైతులతో పోలీసుల వాగ్వాదం
సాగులో ఉన్న భూమి వద్ద ధర్నా చేస్తున్న గిరిజన రైతులు
మొక్కజొన్న పంటను బ్లేడు ట్రాక్టర్లతో
ధ్వంసం చేస్తున్న దృశ్యం
చేతికందిన పంటను ధ్వంసం
చేస్తుండడంతో విలపిస్తున్న
గిరిజన మహిళ
రామభద్రపురం:
రామభద్రపురం మండలం కాకర్లవలసలో పోలీసులు, అధికారుల సాక్షిగా బుధవారం సాగిన రాక్షసకాండపై గిరిజన రైతులు గగ్గోలు పెట్టారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలను యంత్రాల సాయంతో ధ్వంసం చేయడంతో కన్నీరుపెట్టారు. కొన్నాళ్లు ఆగండయ్యా.. పంట చేతికొస్తుందని వేడుకున్నా వినిపించుకోని అధికారుల తీరుపై దుమ్మెత్తి పోశారు. పదుల సంఖ్యలో పోలీసులు మోహరించి అమాయక గిరిజన రైతులు సాగుచేసిన పంటలను నిర్ధాక్షిణ్యంగా ధ్వంసం చేయడాన్ని తప్పుబట్టారు. కొన్నేళ్లుగా గిరిజన రైతుల సాగులో ఉన్న భూమిని స్వాధీనం చేసుకునే క్రమంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను విమర్శించారు. రాధికా వెజిటబుల్స్ పరిశ్రమ కోసం రెవెన్యూ, పోలీస్ అధికారులు చేపట్టిన దమనకాండను ఖండించారు.
మండలంలోని కొట్టక్కి రెవెన్యూ, మిర్తివలస పంచాయతీ పరిధిలోని కాకర్లవలస, కారేడువలస గ్రామాల వద్ద 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం నెలిపర్తి పంచాయతీ పుల్లేరుగుడ్డివలస గ్రామానికి చెందిన పలువురు గిరిజన రైతులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఇచ్చింది. ఆ భూమిని రాధిక వెజిటల్‌బుల్స్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఏపీఐఐసీ అమ్మేయడాన్ని నిరసిస్తూ గత నెల 27, 28వ తేదీలలో గిరిజన రైతులు ఆందోళన చేశారు. పరిశ్రమ పనులను అడ్డుకున్నారు. అప్పట్లో వెనుకకు తగ్గిన పరిశ్రమ ప్రతినిధులు ముందుగానే రెవెన్యూ, పోలీస్ అఽధికారులకు ఫిర్యాదు చేసి బుధవారం పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న గిరిజన రైతులు, సీపీఎం నాయకులు ఎం.కృష్ణమూర్తి, కోరాడ ఈశ్వరరావు తదితరులు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిశ్రమ ప్రతినిధుల ఫిర్యాదుతో ఆర్డీఓ రామ్మోహనరావు, డీఎస్పీ గోవిందరావు, బొబ్బిలిటౌన్, రూరల్, గజపతినగరం సీఐలు కె. నారాయణరావు, మల్లికార్జునరావు, సన్యాసినాయుడు, సుమారు 50 పోలీస్ సిబ్బంది మొహరించారు. పరిశ్రమ పనులను అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని సీపీఎం నాయకులతో పాటు 48 మంది గిరిజన రైతులను అరెస్టుచేసి బాడంగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు సాగుచేసిన మొక్కజొన్న పంటను రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఆరు బ్లేడు ట్రాక్టర్లతో నిర్ధాక్షిణ్యంగా ధ్వంసం చేశారు. పంట చేతికందే సమయంలో యంత్రాలతో నాశనం చేయడాన్ని చూసి రైతులు కన్నీరుపెట్టారు. ఏళ్లుగా గిరిజనుల సాగులో ఉన్న భూమిని అధికార బలంతో దౌర్జన్యం చేసి లాక్కొంటున్నారంటూ విలపించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టడంతోనే పెత్తందార్లకు కొమ్ముకాస్తున్నారంటూ గొగ్గోలు పెట్టారు.
సీపీఎం నాయుకులను ఈడ్చుకెళ్తున్న పోలీసులు


