● రోజురోజుకూ పెరుగుతున్న దోమలు
● నివారించకపోతే నష్టమే
● మన్యాన్ని వీడని మలేరియా
● నేడు ప్రపంచ దోమల
నివారణ దినోత్సవం
సీతంపేట/విజయనగరం ఫోర్ట్: మలేరియా, డెంగీ, చికున్ గున్యా పేర్లు వినని వారు ఉండరు. దోమవల్ల వ్యాపించే ప్రాణాంతకమైన జ్వరాల పేర్లు ఇవి. చిన్నదోమ ఎంత పెద ప్రమాదాన్ని తీసుకువస్తుందో చెప్పడానికి ఈ జ్వరాలే ఉదాహరణ. పట్టణాలతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. ఇటీవల రోజురోజుకు మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రభుత్వ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో ఎక్కువ మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్న వారి సంఖ్యకూడా ఎక్కువగానే ఉంది.
దోమల నివారణ దినం ఎందుకంటే..
ప్రపంచానికి కామన్ శత్రువుగా మారిన దోమల ఆట కట్టించడానికి సర్ రోనాల్డ్ రాస్ శతాబ్దం క్రితమే రంగంలోకి దిగారు. 1897లో ఆయన దోమల ద్వారానే మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతు న్నాయని నిర్ధారించారు. ఈ పరిశోధనకు గాను ఆయనకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజెనిక్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆగస్టు 20న అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించింది.
దోమలపై దాడికి లక్షల్లో ఖర్చు
దోమలు ప్రజారోగ్యాన్ని కాటేస్తున్నాయి. చిన్నా,పెద్దా తేడా లేకుండా దోమలు రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమల దాడిని తట్టుకునేందుకు ప్రతి నెలా పచారి సామగ్రి మాదిరిగానే లిక్విడ్స్, మస్కిటో రీఫిల్స్, కాయిల్స్, మస్కిటో ధూప్ స్టిక్స్ వంటి వాటికి నెలకు రూ.100 నుంచి రూ.500 వరకు ఒక్కో కుటుంబం ఖర్చు చేస్తుంది. ఇవి కాకుండా దోమల బ్యాట్స్, దోమతెరలు, యాంటీ మస్కిటోమెష్ వంటి వాటికోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించక తప్పడం లేదు. దోమ కాటు వల్ల వచ్చే వ్యాధుల నివారణకు ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిందే.
అరికట్టేదెలా..
దోమలు నీటిలో లార్వా, ప్యూపా దశలో పెరుగుతున్నప్పుడు నాశనం చేయడం చాలా సులువైన పని. ఇవి ఇంటిలో నీటిని నిల్వ చేసే కుండీల్లో చిన్నచిన్న పురుగుల్లా కనిపిస్తుంటాయి. వాటిని చాలా మంది నీటి పురుగులు, జలగలు అని పిలుస్తుంటారు. ఇలా దోమ పిల్లలు (లార్వా) నిల్వ నీటిలో ఉన్నట్లయితే ఆ నీటిని మట్టి లేదా ఇసుకలో పారబోయాలి. ఇలా చేయడం వల్ల లార్వా, ప్యూపా దశల్లో ఉన్న వాటిని వందల సంఖ్యలో నాశనం చేయవచ్చు.
అప్రమత్తంగా ఉండాలి
దోమల నుంచి వచ్చే వ్యాధు ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మలేరియా ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులను అప్రమత్తం చేశాం. విజయపార్వతి,
డీఎంహెచ్‌వో, పార్వతీపురం మన్యం
అనర్థాలివే..
ఆడ ఎనాఫిలస్ దోమ కుట్టడం వల్ల మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా జ్వరాలు, ఈడిస్, క్యూలెక్స్ దోమలవల్ల బోదకాలు వస్తాయి.
నిల్వ ఉన్న మంచినీరు, వర్షపునీరు, మురుగు నీటిలో దోమలు గుడ్లు పెట్టడం ద్వారా వృద్ధి చెందుతాయి.
వర్షాల కారణంగా రోడ్లపైన కొబ్బరిబొండాలు, పాతటైర్లు, రుబ్బురోళ్లలో నిల్వ ఉన్న నీరు వాటి ఆవాస కేంద్రాలు.
అవసరాల కోసం నీటిని కుండీలు, ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో నిల్వ చేయడం వల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయి.


