గుర్ల: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, సోలార్ పేట్లు దొంగిలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ఎస్.రాఘవులు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి అరెస్ట్ చేసిన వారి వివరాలను తెలియజేశారు. గరికివలసకు చెందిన ఆవాల రాజేష్, కెల్లకు చెందిన కెల్ల అనిల్ కుమార్, వేమలవాసు, నెల్లిమర్లకు చెందిన టి.పృథ్వీరాజ్‌లను అరెస్ట్ చేసి వారి నుంచి 40 కేజీల రాగి వైర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ రాగి వైర్లు కొనుగోలు చేస్తున్న పైడిభీమవరానికి చెందిన గణేష్‌ను అరెస్ట్ చేశామని చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలి పారు. అరెస్ట్ చేసిన నలుగురిపై గుర్ల పోలీస్ స్టేషన్‌లో ఏడు కేసులు, నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు ఉన్నాయన్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలను పట్టుకున్న ఎస్సై పి.నారాయణరావును, గుర్ల పోలీస్ స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ, సీఐ అభినందించారు.
రెండో విడతలో 71 మందికి అక్రిడిటేషన్లు
విజయనగరం గంటస్తంభం: ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారాన్ని చేరవేయడంలో, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ రెండో విడత సమావేశం బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రెండో విడతగా 71 మంది మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్లు మంజూరు చేసేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో 68 కొత్త అక్రిడిటేషన్లు, ఇద్దరి పేర్ల మార్పు, ఒక దరఖాస్తును వెరిఫికేషన్‌కు ఆమోదించారు. దినపత్రికలు, పీరియాడికల్స్, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ నెట్‌వర్క్ తదితర విభాగాల నుంచి ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను నిబంధనల మేరకు పరిశీలించారు. పెద్ద, మధ్య తరహా దినపత్రికల నుంచి 26, చిన్న దినపత్రికల నుంచి 13, పీరియాడికల్స్ నుంచి 3, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి 19, కేబుల్ నెట్‌వర్క్ నుంచి 2, అధికారిక మీడియా విభాగం నుంచి ఇద్దరికి అక్రిడిటేషన్లకు ఆమోదం లభించింది. సమావేశంలో కమిటీ కన్వీనర్ పి.గోవిందరాజులు, సభ్యులు బాలాజీ, మురళీమోహన్, జి.ఎల్లాజిరావు, డా.కె.రాణి, బి.శ్రీనివాసరావు, పి.ఎస్.ఎస్.వి ప్రసాదరావు, వై.శ్రీరాములునాయుడు, బి. నాగేంద్ర ప్రసాద్, ఎం.పి.వెంకటేశ్వరపాత్రో, బి.జి.ఆర్.పాత్రో, ఎం.శివకుమార్, పి.అప్పారా వు, పి.ఆర్.ఓ.మజ్జి వాసుదేవరావు, ఏపీఆర్‌ఓ సిహెచ్.ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.
కాలువలో పడి వ్యక్తి మృతి
రేగిడి: మండలంలోని పెదకోడిశ గ్రామానికి చెందిన పనస వెంకునాయు డు (75) మడ్డువలస ప్ర ధాన కుడికాలువలో ప్ర మాదవశాత్తు జారిపడి బు ధవారం మృతిచెందారు. ఈ ఘటనపై స్థానికులు తె లిపిన వివరాల ప్రకారం పంటపొలానికి నీటిని పెట్టేందుకు వెంకునాయుడు కాలువలో దిగాడు. ఆ సమయంలో జారి పడడంతో పక్కనే ఉన్న రాయికి తల తగలగా బలమైన గాయమై నీటిలోనే పడి మృతిచెందాడు. సమీపంలోని రైతులు పడిపోయిన వ్యక్తిని గమనించి కాలువ నుంచి బయటకు తీశారు. అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు. మృతుడికి భార్య అప్పలనర్సమ్మ, కుమారుడు సత్యంనాయుడు ఉన్నారు. వెంకునాయుడు నీటిపారుదల శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ విషయంపై ఎస్సై బాలకృష్ణ వద్ద ప్రస్తావించగా తమకు ఎటువంటి సమాచారం అందలేదన్నారు.


