వంగర: రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు ఆ కుటుంబానివి. బతుకుతెరువు కోసం విశాఖపట్టణానికి వవెళ్లి నాలుగు రూపాయలు వెనుకేసుకుని జీవనోపాధి సాగించాలన్న ఆ కుటుంబంపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం ఆ కుటుంబ వారసుడిని విగతజీవిగా మార్చింది. ఆస్పత్రిలో లక్షల ఖర్చు అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఉన్న డబ్బులను కుమారుడిని రక్షించుకునేందుకు వైద్యఖర్చులకు తల్లిదండ్రులు జమచేశారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇంకా మెరుగైన వైద్యం కావాల్సి ఉంది. ఎన్‌టీఆర్ వైద్య సేవ వర్తించదని వైద్యులు తెగేసి చెప్పారు. ప్రస్తుతం ఆర్థికంగా తమ వద్ద ఏమీ లేకపోవడంతో ఆపన్న హస్తాల కోసం ఆ నిరుపేద తల్లిదండ్రులు దీనంగా ఎదురు చూస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
వంగర మండలంలోని నీలయ్యవలస గ్రామానికి చెందిన టొంపల చిరంజీవి తల్లిదండ్రులు టొంపల శ్రీను, జయమ్మలతో కలిసి విశాఖపట్నంలోని డెయిరీఫాం వద్ద ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. తండ్రి తాపీమేస్త్రి, తల్లి ఇంటి వద్ద ఉంటుంది. చిరంజీవి రోజువారీ పనిచేస్తుండగా కుటుంబం జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో రోజువారీ పని పూర్తిచేసుకుని విశాఖపట్నంలోని డెయిరీఫాం వద్ద తన నివాసానికి చిరంజీవి బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డుపై పడిపోగా రెండు కళ్లు దెబ్బతిన్నాయి. ముఖం, తల భాగంపై తీవ్ర గాయాలయ్యాయి. కుడి కాలు విరిగిపోయింది. ఈ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కుమారుడిని హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా
గాయపడిన యువకుడు
కనీస ఖర్చులకు అవస్థలు పడుతున్న తల్లిదండ్రులు
సాయం చేయాలంటే దాతలకు విజ్ఞప్తి
ఆదుకోని ఎన్టీఆర్ వైద్యసేవ..
ఎన్టీఆర్ వైద్య సేవ తమను ఆదుకోలేదని క్షతగాత్రుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆస్పత్రిలో డబ్బులు చెల్లించి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన చెందుతున్నారు. తమ వద్ద ఉన్న రూ.2 లక్షలు ముఖ భాగం సర్జరీకి ఖర్చుకు ఆస్పత్రిలో జమ చేశారు. మరో సర్జరీ అవసరమని, సుమారు రూ.7లక్షల నుంచి రూ.9 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. వారి వద్ద చిల్లిగవ్వ లేదు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును రక్షించుకునేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు ఇన్నీ..అన్నీ కావు. మనసున్న వారంతా ఆర్ధికంగా చేయూతనిచ్చి తన కుమారుడిని రక్షించాలని దాతలను వేడుకుంటున్నారు. ఆర్థిక సహాయం చేయదలచిన వారు ఫోన్ 7093645664 నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు.


