● ఎంటీఎస్ ఉపాధ్యాయులకు అందని జీతాలు
● రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులు
బలిజిపేట: ఎంటీఎస్ ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారికి జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. వారు ఎప్పుడు ఏ పాఠశాలకు డిప్యుటేషన్ పేరిట వెళ్లాల్సి వస్తుందో తెలియదు. మండల, డివిజన్‌స్థాయిలో రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు వారికి కౌన్సెలింగ్ జరిగేటప్పుడు వారికి
అన్యాయం జరుగుతోందనేది జగమెరిగిన సత్యం. రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు అన్ని నిబంధనలు పాటించాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా వారికి న్యాయం జరిగిన దాఖలాలు లేవు. పాఠశాలలు జూన్ నెలలో ప్రారంభించినా నేటికీ వారికి జీతాలు అందకపోవడం గమనార్హం. విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా తలెత్తిన సాంకేతిక కారణాలు చూపుతూ జీతాల చెల్లింపు నిలుపుదల చేస్తున్నారు. స్వల్ప వేతనంతో జీవనం సాగిస్తున్న ఉపాధ్యాయులు తీవ్రస్థాయిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో వారు పనిచేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 400మందికి పైగా ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఉన్నారు. జూన్ నెలలో బదిలీల అనంతరం కొత్త పాఠశాలల్లో చేరిన ఉపాధ్యాయులకు ఇప్పటివరకు జీతాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
సాంకేతిక సమస్యలంటూ సాకులు
ఉపాధ్యాయుల తప్పిదం లేకపోయినా పొజిషన్ ఐడీల మ్యాపింగ్, క్యాడర్ స్ట్రెంత్ డిస్‌ప్లే, ఇతర సాంకేతిక ప్రక్రియలు పూర్తికాకపోవడంతో బిల్లులు సమర్పించలేని పరిస్థితి ఎదురైంది. జూన్ నెలలో జిల్లా కౌన్సెలింగ్ జరిగిన తరువాత రోజున ఎంఈఓలు మండలస్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహించి విధుల నిర్వహణకు పాఠశాలలు కేటాయించి ఎప్పుడు, ఎక్కడికి అవసరమైతే అక్కడికి డిప్యుటేషన్‌పై వెళ్లాల్సి ఉంటుందనే నిబంధన విధించారు. జూన్ నెలలో జీతాల బిల్లులు పెట్టిన తరువాత ఎంటీఎస్‌లకు జిల్లా కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో జీతాల బిల్లులకు సాంకేతిక సమస్య ఎదురైంది. బిల్లులు సక్రమంగా పెట్టనందున జూలైలో జీతాలు అందలేదు. పోనీ జూలైలో అయినా సక్రమంగా సాగుతోందా? అంటే అదీ జరగలేదు. దీంతో వారికి రెండు నెలల జీతాలు అందలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పనిచేస్తున్న వారు వారి జాయినింగ్ ఆర్డర్లు, కుల ధ్రువీకరణ పత్రం పట్టుకుని జిల్లా ఎస్టీఓ కార్యాలయానికి రావాలని సూచించడంతో ఎంటీఎస్ ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. సాంకేతిక సమస్యలు పరిష్కరించి జీతాలు మంజూరుచేయాలని వారు కోరుతున్నారు.
ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులో స్థిరమైన విధానం లేదు. రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు ఎంటీఎస్ ఉపాధ్యాయులకు సక్రమంగా జీతాలు చెల్లించాలి. దీనిపై సంఘాల తరఫున డిమాండ్ చేశాం. నిధి పోర్టల్ సమస్యలను త్వరగా పరిష్కరించాలి. ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఎస్టీఓ కార్యాలయానికి వ్యక్తిగతంగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేవిధంగా కాకుండా డీడీఓల ద్వారా అప్‌లోడ్ చేసే విధంగా చర్యలు చేపడితే బాగుంటుంది.
ఎం.శేషగిరి, అధ్యక్షుడు,
ఏపీటీఎఫ్ పార్వతీపురం మన్యం జిల్లా


