పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుదాం | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుదాం

Jul 26 2026 2:38 AM | Updated on Jul 26 2026 2:38 AM

వీరఘట్టం: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుదామని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. వీరఘట్టం మండలం బిటివాడలో శనివారం నిర్వహించిన గట్టు మీద చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొని పొలం గట్లపై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొలం గట్టుపై మొక్కలు నాటడంతో రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణం సమతుల్యం అవుతుందన్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉందన్నారు. కార్యక్రమంలో పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాఽథ్‌, వ్యవసాయశాఖ జేడీ భవానీశంకర్‌, ఏడీఏలు రత్నకుమారి, అన్నపూర్ణ, డీపీఎం శ్రావణ్‌కుమార్‌, మండల వ్యవసాయశాఖ అధికారి జె.సౌజన్య పాల్గొన్నారు.

విద్యార్థులకు పూర్తి స్థాయిలో వైద్యం అందాలి

డీఎంహెచ్‌ఓ పి.విజయలక్ష్మి

గుమ్మలక్ష్మీపురం: అనారోగ్యంతో ఉన్న విద్యార్థులకు పూర్తి వైద్యం అందించాకే అవసరమైతే ఇంటికి పంపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పి.విజయలక్ష్మి సూచించారు. టిక్కబాయి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న తోయక వరుణ్‌ అనారోగ్యంతో స్వగ్రామమైన దేరుగండలో గురువారం మృతి చెందిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వరుణ్‌ చదివిన ఆశ్రమ పాఠశాలను డీఎంహెచ్‌ఓ శనివారం సాయంత్రం సందర్శించారు. విద్యార్థి మృతి చెందిన సంఘటనపై హెచ్‌ఎం, డిఫ్యూటీ వార్డెన్‌, వైద్యాధికారి ఇతర సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థికి అందించిన చికిత్స వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాలలోని విద్యార్థుల ఆరోగ్యం పట్ల వైద్య సిబ్బంది, ఆశ్రమ పాఠశాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థుల్ని ఆస్పత్రిలో చేర్పించి, పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని, కోలుకున్న తర్వాత తల్లిదండ్రులు కోరితే ఇళ్లకు పంపించాలనన్నారు. ఆమె వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కె.వి.ఎస్‌ పద్మావతి, జిల్లా మలేరియా అధికారి సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.

నేర ప్రవృత్తిని విడనాడాలి

ఖైదీలకు న్యాయమూర్తి ఎం.మాధురి సూచన

సబ్‌ జైలు ఆకస్మిక తనిఖీ

పార్వతీపురం రూరల్‌: కారాగారాల్లో ఉన్న ఖైదీలు నేరప్రవృత్తిని విడనాడి, సత్‌పౌరులుగా జీవించాలని రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు ఎం.మాధురి సూచించారు. పార్వతీపురం సబ్‌ జైలును ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది, తోటి ఖైదీలు వివక్ష చూపరాదన్న సుప్రీంకోర్టు తీర్పును గుర్తుచేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. అనంతరం జైల్‌లోని లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ పనితీరును, న్యాయవాదులు, పారా లీగల్‌ వలంటీర్ల విధులను పరిశీలించారు. రిమాండ్‌లో ఉన్న ఏ ఒక్క ముద్దాయీ న్యాయవాది లేరనే ఇబ్బంది పడకూడదని, ఆర్థిక స్తోమత లేని వారికి సంస్థ తరఫున ఉచితంగా న్యాయవాదిని సమకూర్చుతామని స్పష్టం చేశారు. అనంతరం ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైలులోని వంటగది, భోజనశాల, స్టోర్‌ రూమ్‌లను పరిశీలించి సరుకులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ జె.సౌమ్యజోసఫిన్‌, సబ్‌ జైల్‌ సూపరింటెండెంట్‌ జి.రాము పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement