గ్యాస్‌ మంట.. | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ మంట..

Mar 12 2026 7:17 AM | Updated on Mar 12 2026 7:17 AM

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2026
చిరు వ్యాపారులకు తంటా!

ఎల్‌పీజీ సిలిండర్ల కొరత

దుకాణాలు మూసుకుంటున్న వ్యాపారులు

హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ వంటకు తంటా..

సాక్షి, పార్వతీపురం మన్యం: పశ్చిమాసియాలో యుద్ధం వేళ.. చమురు సంస్థల నిర్ణయాలు ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎల్‌పీజీ గ్యాస్‌ సంక్షోభ ప్రచారం ఓవైపు ఉండగా.. జిల్లాలో గతం మాదిరి వంట గ్యాస్‌ లభ్యత కాకపోవడంతో ఆ ప్రభావం ఇటు గృహావసరాల వినియగదారులపైనా, చిరుహోటళ్లపైనా పడుతోంది. ఇటీవలే చమురు సంస్థలు గ్యాస్‌ ధరలను పెంచిన విషయం విదితమే. ఇప్పుడు గ్యాస్‌ బుక్‌ చేసిన 21 రోజుల తర్వాతే సిలిండర్‌ వస్తుందని చెప్పడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

అడిగిన వెంటనే ఇవ్వలేం..

గ్యాస్‌ కొరతతో ప్రధానంగా చిన్న హోటళ్లు, రహదారి పక్కన తినుబండారాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నడిపేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 16 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2.72 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. సగటున ప్రతినెలా 1.50 లక్షల సిలిండర్ల వినియోగమవుతాయని అంచనా. గృహావసరాలకు సాధారణంగా నెలకు ఒక సిలిండర్‌ చొప్పున వినియోగమవుతుంది. చిన్న ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, హోటళ్ల వారు ఎక్కువగా గృహావసర సిలిండర్లనే వినియోగిస్తుంటారు. ఇది అక్రమమని తెలిసినా.. వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1,900 వరకు ఉండడంతో అంత మొత్తం వెచ్చించలేక, వీటిపైనే ఆధారపడుతున్నారు. రెండు, మూడు రోజులకో సిలిండర్‌ వీరికి వినియోగమవుతుంటోంది. గ్యాస్‌ ఏజెన్సీలు సైతం అనధికారికంగా వీరికి సిలిండర్లు సరఫరా చేయగా.. మరికొంతమంది తెలిసిన వారి ఇళ్ల నుంచి వీటిని విడిపించుకుంటున్నారు. గతంలో సిలిండర్‌ బుక్‌ చేసుకున్న ఒకట్రెండు రోజుల్లోనే సరఫరా అయ్యేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు.

మూతపడుతున్న దుకాణాలు

జిల్లాలో ప్రతి సందులోనూ చిన్న టిఫిన్‌ కొట్టులు, ఫాస్ట్‌ ఫుడ్‌సెంటర్లు దర్శనమిస్తున్నాయి. పార్వతీపురం వంటి పట్టణంలోనే 200కుపైగా ఉన్నాయి. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్ల కొరత ఏర్పడటంతో ఆ ప్రభావం వీరిపై పడుతోంది. ఇప్పటికే ఉన్న నిల్వలు అయిపోవడం.. సిలిండర్‌ అడిగినా ఏజెన్సీలు 25 రోజుల వరకు ఇవ్వలేమని చెప్పడంతో కొంతమంది కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. మరి కొందరు హోటళ్లకు, ఫాస్ట్‌ ఫుడ్‌సెంటర్లకు విరామం ఇస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో మరిన్ని టిఫిన్‌ దుకాణాలు, రోడ్డు పక్కన బళ్లు మూత పడే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.

హాస్టళ్లకు తప్పని తంటా..

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు, అంగన్‌వాడీ సెంటర్లనూ గ్యాస్‌ కొరత వెంటాడుతోంది. విద్యార్థులకు వంటకాలు చేసేందుకు గ్యాస్‌ కష్టాలు వెంటాడుతున్నాయంటూ నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. గ్యాస్‌ కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.

పార్వతీపురం: జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఎల్‌పిజీ సిలెండర్లను నిరంతరాయంగా ఎలాంటి జాప్యం లేకుండా సరఫరా చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. తన కార్యాలయంలో జిల్లా పౌరసరఫరా శాఖాధికారి, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ ఉప సంచాలకులతో ఆయన సమీక్షించారు. క్షేత్రస్థాయిలో గ్యాస్‌ సరఫరా స్థితిగతులను పర్యవేక్షించి ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. గ్యాస్‌ సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణకు నోడల్‌ అధికారిని నియమించామన్నారు. నోడల్‌ అధికారితో సమన్వయం చేసుకొని గ్యాస్‌ ఇబ్బందిలేకుండా చూసుకోవాలని సూచించారు. వేసవి దృష్ట్యా విద్యార్థులు, ప్రజలు వడగాడ్పులకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ కె. హేమలత, ఎస్‌డీసీ ఎస్‌.దిలీప్‌చక్రవర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement