గుమ్మలక్ష్మీపురం: అతివేగం వల్ల నిండు ప్రాణం బలైన సంఘటన మండలంలోని పి.ఆమిటి జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరానికి చెందిన బట్టల వ్యాపారి అనిల్ జైన్ (47) తన భార్య జ్యోతిజైన్‌తో కలిసి సొంతకారులో డ్రైవర్ తారాడ రాంబాబుతో పాటు నగదు కలెక్షన్ నిమిత్తం గుమ్మలక్ష్మీపురం మీదుగా ఒడిశాలోని గుమడకు బుధవారం ఉదయం బయలుదేరాడు. సరిగ్గా మండలంలోని పి.ఆమిటి జంక్షన్ వద్దకు రాగానే రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీ కొనడంతో ముందు సీట్లో కూర్చున్న అనిల్‌జైన్‌తో పాటు డ్రైవర్ రాంబాబు, వెనుక సీట్లో కూర్చున్న జ్యోతిజైన్ గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది చేరుకుని క్షతగాత్రులను భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనిల్‌జైన్ మృతి చెందాడు. మెరుగైన వైద్యం నిమిత్తం మృతుడి భార్య జ్యోతి జైన్‌తో పాటు డ్రైవర్ రాంబాబును పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎల్విన్‌పేట ఎస్సై బి.శివప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. శవపంచనామా అనంతరం అనిల్‌జైన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
ఒకరి మృతి..
ఇద్దరికి తీవ్ర గాయాలు


