క్రీడాకారులు
13 జిల్లాలు..
156 మంది
విజయనగరం: పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా పోటీలకు విద్యలకు నిలయమైన విజయనగరం అతిధ్యమివ్వనుంది. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేసన్ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో విజయనగరం నగర శివారుల్లో గల సర్ విజ్జీ స్టేడియంలో 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఖోఖో పోటీలు జరగనున్నాయి. అండర్–17 విభాగంలో బాలికలకు నిర్వహించే పోటీల్లో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో 156 మంది క్రీడాకారులు, 26 మంది కోచ్ అండ్ మేనేజర్‌లు, 25 మంది రిఫరీలు, మరో 30 మంది వ్యాయామ ఉపాధ్యాయులు కలిపి మొత్తంగా 250 మంది పాల్గొననున్నారు. పోటీల నిర్వహణకు సంబంధించి జిల్లా విద్యా శాఖ అధికారి మాణిక్యంనాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు.
ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో పోటీలు నిర్వహణ
రాష్ట్ర స్థాయిలో నిర్వహించే అండర్–17 బాలికల ఖోఖో పోటీలకు సంబంధించి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. విజ్జీ స్టేడియంలో ప్రతి రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా పోటీలు ప్రారంభించనున్నారు. ప్రతి రోజు సాయంత్రం వేళల్లో ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో పోటీలు నిర్వహించనున్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించే పోటీల్లో బాల, బాలికల విభాగాల్లో లీగ్ దశలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జట్లను నాకౌట్ దశకు ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉండగా మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు 25వ తేదీ ముగింపు రోజున బహుమతీ ప్రధానోత్సవం చేస్తారు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసి అదే రోజున బాల, బాలికల జట్ల వివరాలను ప్రకటించనున్నారు.
ఉచితంగా భోజన, వసతి సదుపాయాలు
అండర్–17 స్కూల్ గేమ్స్ బాలికల ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి విజయనగరం వచ్చే క్రీడాకారులకు ఉచితంగా భోజన, వసతి సదుపాయాలను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధులు కల్పించారు. భోజన సదుపాయాన్ని పోటీలు నిర్వహించే విజ్జీ స్టేడియంలో ఏర్పాటు చేయగా... క్రీడాకారిణుల వసతి కోసం నగరంలోని కస్పా కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను కేటాయించారు. అక్కడి నుంచి విజ్జీ స్టేడియంకు క్రీడాకారులు రాకపోకలు సాగించేందుకు ప్రత్యేకంగా వాహన సదుపాయాన్ని ఏర్పాట్లు చేశారు.
ఏర్పాట్లు పూర్తి..
విజయనగరం వేదికగా మూడు రోజుల పాటు అండర్–17 బాలికల స్కూల్ గేమ్స్ ఖోఖో పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పూర్తి ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు జరుగుతాయి. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటలకు మ్యాచ్‌లు జరుగుతాయి. క్రీడాకారులకు, కోచ్‌లకు, రిఫరీలకు భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నాం.
– కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు, విజయనగరం
జిల్లా వేదికగా అండర్–17 బాలికల స్కూల్ గేమ్స్ ఖోఖో పోటీలు
నేటి నుంచి మూడు రోజులు పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలు
సర్ విజ్జీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు
జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్
ఆధ్వర్యంలో లీగ్ కమ్ నాకౌట్
పద్ధతిలో పోటీలు


