లేబర్ కోడ్‌లపై కార్మిక సంఘాల కన్నెర్ర
● ఉత్తర్వుల ప్రతుల దహనం
పార్వతీపురం రూరల్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ కోడ్స్ పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్మికులకు నష్టదాయకంగా ఉన్నాయని ఆరోపిస్తూ శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇఫ్టూ, సీపీఐఎంఎల్ లిబరేషన్, టీయూసీఐ, రైతు కూలి సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసనానంతరం, కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు మాట్లాడుతూ అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు ఊడిగం చేసేందుకే మోదీ ప్రభుత్వం ఈ కోడ్స్‌ను తెచ్చిందని మండిపడ్డారు. ఈ చట్టాలు వలస పాలనను మించిన బానిసత్వాన్ని కార్మిక వర్గంపై రుద్దుతాయన్నారు. 29 కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయకుండా, నాలుగు నష్టదాయక కోడ్స్ అమలులోకి తీసుకురావడం పచ్చి అబద్ధం అని ధ్వజమెత్తారు. లేబర్ కోడ్స్‌లోని అత్యంత ప్రమాదకరమైన అంశాన్ని వివరిస్తూ ‘ఇప్పటివరకు 100 మందికి పైగా కార్మికులున్న సంస్థలు లే–ఆఫ్ చేయాలన్నా, లాకౌట్ చేయాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరని, కానీ, కొత్త కోడ్స్ ఆ పరిమితిని 300కు పెంచాయన్నారు. అంటే, 300లోపు కార్మికులున్న కంపెనీలను యాజమాన్యాలు తమ ఇష్టానుసారం మూసివేసి తొలగించవచ్చు. ఇది కార్మికుల హక్కులపై నిర్ధాక్షిణ్యంగా వేటు వేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ కోడ్స్‌ను రద్దు చేయించే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాలకు చెందిన నాయకులు కుమార్, గొర్లి వెంకటరమణ, ఎం.భాష , ఇ.భాస్కరరావు, నర్సింగరావు, ఈ జీవన్, సూరయ్య (టీయూసీఐ), పి.రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


