జేఎన్‌టీయూ–జీవీ, డీఎస్‌ఎన్‌ఎల్‌యూ మధ్య ఎంవోయూ
విజయనగరం రూరల్: పీజీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ – కృత్రిమ మేధస్సు, టెక్నాలజీ చట్టం (పీజీసీపీఏఐటీఎల్) అందించేందుకు జేఎన్‌టీయూ – జీవీ, విశాఖపట్నం దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (డీఎస్‌ఎన్‌ఎల్‌యూ) మధ్య పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) శనివారం కుదుర్చుకున్నాయని జేఎన్‌టీయూ – జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు తెలిపారు. ఇరు యూనివర్సిటీల ఉప కులపతులు సంతకాలు చేయడంతో అమల్లోకి వచ్చిన ఒప్పందంతో ఏఐ, డిజిటల్ టెక్నాలజీలు, న్యాయ వ్యవస్థల సమగ్రతలో నైపుణ్యం కలిగిన నిష్ణాతుల అవసరాన్ని తీర్చేందుకు ఈ విద్యా భాగస్వామ్యం ఉపయోగపడుతుందని ఇరు యూనివర్సిటీల ఉప కులపతులు తెలిపారు. ఈ ఒప్పందంలో కోర్సు రూప కల్పన, హైబ్రీడ్ బోధన విధానం, అంచనాలు (అసెస్‌మెంట్‌లు), ప్రయోగశాల శిక్షణ, సర్టిఫియేషన్ వంటి అంశాలు ఉన్నాయన్నారు. లీగల్ ఇన్ఫర్మాటిక్స్, సైబర్ లా, డిజిటల్ గవర్నెన్స్, లీగల్ – టెక్ టూల్స్, ఎన్‌ఎల్‌పీ ఆధారిత న్యాయ విశ్లేషణ, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్స్, ఏఐ ఆధారిత న్యాయ ప్రక్రియలు వంటి అంశాలు చేర్చబడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో ఏఐ, న్యాయ కోర్సును ఒకే కోర్సుగా చేయడం ఇదే మొదటిసారన్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి కోర్సులు చాలా తక్కువ ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం 5 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలి బ్యాచ్ 2026 జనవరిలో ప్రారంభమవుతుందన్నారు. ప్రవేశాల నోటిఫికేషన్ వచ్చే నెలలో ఇరు విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా విడుదల చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఇరు విశ్వవిద్యాలయాల అధికారులు పాల్గొన్నారు.


