
మందులు కొరత లేకుండా చూసుకోవాలి
● బందలుప్పి వైద్యాధికారి డా.శ్రీకాంత్
పార్వతీపురం రూరల్: దీర్ఘకాలిక వ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులు ఉన్నవారికి 104 వైద్యశిబిరం ద్వారా నెలకు సరిపడా మందులు పూర్తిస్థాయిలో అందించి సరఫరా చేసేందుకు మందుల కొరత లేకుండా చూసుకోవాలని బందలుప్పి వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు బందలుప్పి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో ఉన్న హెచ్ కారాడ వలసలో 104 వైద్యశిబిరాన్ని ఆయన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 60సంవత్సరాల పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, గర్భిణులు, బాలింతలకు వైద్య పరీక్షలు చేసి వారికి కావాల్సిన మందులిస్తూ పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని వైద్యసిబ్బందికి సూచించారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా గ్రామాల్లో అనారోగ్యం బారిన పడిన వారికి ప్రతి రోజు వైద్యపరీక్షలు చేస్తూ ఎలాంటి లక్షణాలు గుర్తించినా మెరుగైన వైద్యం అందించాలన్నారు.