
ఆక్రమణలకు అడ్డేలేదా?
చీపురుపల్లి: ఆక్రమణదారులకు ఎక్కడైతే ఏముంది. అది ప్రభుత్వ కార్యాలయం కావొచ్చు, ప్రైవేట్ స్థలం అవ్వొచ్చు. ఏదైనా సరే అధికార పార్టీ అండ ఉంటే చాలు ఎలాంటి స్థలంలోనైనా సరే చొరబడిపోవడమే. అయితే ఇంతవరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను ఆక్రమించుకునే ప్రయత్నాలు చూసి ఉంటాం. కానీ ఇక్కడ సాక్షాత్తు మండల పరిషత్ కార్యాలయం వెనుక ప్రహరీని కూల్చి కార్యాలయం ఆవరణలోకి చొరబడి జేసీబీతో మండల పరిషత్ కార్యాలయం ప్రహరీ లోపల ఉన్న స్థలాన్ని చదును చేసిన సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఇదే ప్రహరీకి అవతలి వైపు ఉన్న శ్మశాన వాటిక అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ గద్దే బాబూరావు చేయిస్తున్నారు. ఈ సమయంలో మండల పరిషత్ ప్రహరీని కూల్చి లోపలకు ప్రవేశించి చదును చేయించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మండల పరిషత్ గోడ కూల్చి లోపలికి వచ్చి పనులు చేయిస్తుండడాన్ని తెలుసుకున్న ఇన్‌చార్జి ఎంపీడీఓ ఐ.సురేష్ పనులను నిలిపివేయించారే తప్ప వారిపై చర్యలకు ముందడుగు వేయకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. మండల పరిషత్ కార్యాలయ ప్రహరీ లోపల ఆక్రమణలకు పాల్పడుతున్న స్థలంలో తాగునీటి పైపులు ఉండగా వాటిని తొలగించి ఓ పక్కన పడేయడంతో పైప్‌లైన్ సంగతి ఏమైందో ఇంకా తెలియాల్సి ఉంది.
సర్వేచేసి చర్యలు తీసుకుంటాం
ప్రహరీ కూల్చి లోపలికి వచ్చి చేపడుతున్న పనులను నిలిపివేశాం. పనులు చేస్తున్న వారిని హె చ్చరించాం. మండల పరిషత్ కార్యాలయం స్థలం ఎంత వరకు ఉందో సర్వే నిర్వహించి, త మ కార్యాలయం పరిధిలోకి ఆక్రమణలు వచ్చి నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఐ.సురేష్, ఇన్‌చార్జి ఎంపీడీఓ, చీపురుపల్లి
ప్రభుత్వ కార్యాలయాల్లోకి
చొరబడుతున్న ఆక్రమణదారులు
మండల పరిషత్ కార్యాలయ ప్రహరీ జేసీబీతో కూల్చివేత
కార్యాలయం ఆవరణలో స్థలం
యంత్రాలతో చదును
అడ్డుకున్న మండల పరిషత్ అధికారులు

ఆక్రమణలకు అడ్డేలేదా?