
రహదారుల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
రేగిడి: ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ ప్రాంత రహదారులకు నెల రోజుల్లోనే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని కూటమి ప్రభుత్వం మాట ఇచ్చి నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. గురువారం రేగిడి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్–ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న పాలకొండ–రాజాం ప్రధాన రహదారి పలు చోట్ల పూర్తిగా పాడవడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధానంగా మజ్జిరాముడుపేట, ఉంగరాడమెట్ట, చిన్నయ్యపేట గ్రామాల జంక్షన్‌ల వద్ద సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.8.82 కోట్ల నిధులు రోడ్ల కోసం మంజూరుచేసిందని, ఆ నిధులుతో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కొంతమేర పనులను పూర్తిచేశారన్నారు. అప్పట్లో ఎన్నికల కారణంగా నిలిచిపోయిన రూ.4కోట్లు బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ మిగిలిన పనులను పూర్తిచేసేందుకు ముందుకురావడంలేదన్నారు. రాజాం జీఎంఆర్ ఐటీ వద్ద 355 మీటర్లు, ఉంగరాడమెట్ట వద్ద 395 మీటర్లు, మజ్జిరాముడుపేట వద్ద 150 మీటర్లు సిమ్మెంట్ కాంక్రీట్ రోడ్డు వేయాల్సి ఉందని, కాంట్రాక్టర్‌కు బకాయిలు చెల్లిస్తే తప్ప ఈ రోడ్డు పనిపూర్తిచేయలేమని ఇప్పటికే కాంట్రాక్టర్ చేతులెత్తేశాడన్నారు.
చెప్పిందొకటి..చేస్తున్నదొకటి
ఈ సమస్యను పలుమార్లు ఆర్‌అండ్‌బీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇటీవల కలెక్టర్ అంబేడ్కర్ సంకిలి నాగావళిని చూసేందుకు వచ్చిన సమయంలో ఈ గోతులను స్వయంగా చూశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం చెప్పిందొకటి, చేస్తున్నది ఒకటి, ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రగల్భాలు పలుకుతుండడం వారికి వెన్నతోపెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకుంటే శానసమండలి సమావేశాల్లో ఈ సమస్యను ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. సమావేశంలో పోలినాటి వెలమ రాష్ట్ర మాజీ డైరెక్టర్ కింజరాపు సురేష్, వైఎస్సార్‌సీపీ రాజాం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, లక్ష్మీపురం సర్పంచ్ కెంబూరు వెంకటేశ్వరరావులు ఉన్నారు.
ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్