
డోలీలో ఐదు కిలోమీటర్లు...
బొబ్బిలిరూరల్: బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధి కొత్తబట్టివలస గిరిజన గ్రామానికి చెందిన గర్భిణి సీదరపు గౌరమ్మకు మంగళవారం పురిటినొప్పులు ఆరంభమయ్యాయి. ఆస్పత్రిలో చేర్పించాల్సిని పరిస్థితి. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు డోలీని కట్టి సుమారు 5 కిలోమీటర్ల మేర నిండుగర్భిణిని మోసుకుని గోపాలరాయుడుపేట వద్దకు చేర్చారు. అక్కడ నుంచి 108 వాహనంలో పిరిడి పీహెచ్‌సీకి తరలించారు. ఆమె సాధారణ ప్రసవంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు సేవలు అందిస్తున్నారు. పురిటినొప్పులు వేళ వైద్యసేవలు అందకపోవడంతో నిండుగర్భిణి ఆక్రందనలు కూటమి నాయకులకు వినిపించకపోవడం విచారకరమని గిరిజన నాయకులు మండిపడ్డారు.
ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోల రమణి, అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణరావు మాట్లాడుతూ గిరిజనుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నామన్న ప్రభుత్వం కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతోందని విమర్శించారు. గిరిజనులకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా డోలీలమోత తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెపండగ పనులను పప్పు బెల్లాల్లా పంచుకుతిన్న కూటమి నాయకులు గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాన్ని మరిచిపోయారని ఆరోపించారు. కోట్లాది రూపాయల ఉపాధిహామీ నిధులతో సొంత ప్రయోజనకర పనులను చక్కబెడుతూ గిరిజనులకు డోలీ కష్టాలను మిగుల్చుతున్నారన్నారు. తక్షనమే మౌలిక సదుపాయాలు కల్పించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి
పార్వతీపుం రూరల్: వినాయక చవితి మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరని, సింగిల్ విండోవిధానంలో అనుమతులు జారీ చేస్తామని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి మంగళవారం తెలిపారు. అనుమతుల కోసం హెచ్‌టీటీపీ://గణేష్‌ఉత్సవ్.నెట్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని మీ సేవలో చలనా చెల్లిస్తే అనుమతులు మంజూరవుతాయన్నారు. వాటిని మండపాల వద్ద అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. మండపాల నిర్వాహకులు పోలీస్ నిబంధనలను పాటించాలని సూచించారు.
విద్యార్థుల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ వసతిగృహాల విద్యార్థుల ఆరోగ్యం, విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వసతిగృహాల్లో పల్లె నిద్ర, మైస్కూల్–మై ఫ్రైడ్ కొనసాగుతుందన్నారు. ఒక్కో వసతిగృహాన్ని ఒక మండల ప్రత్యేకాధికారి దత్తత తీసుకోవడం జరిగిందని, వారు సందర్శన సమయంలో ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని స్పష్టం చేశారు. ఆ అధికారులు లోటుపాట్లుపై నివేదిక అందిస్తే సంబంధిత వార్డెన్లపై చర్యలు తప్పవన్నారు. సమావేశంలో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ, సాధికారిత అధికారి ఇ.అప్పన్న, వసతిగృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో 17.2 సెంటీమీటర్ల వర్షపాతం
పార్వతీపురం రూరల్: అల్పపీడనం కారణంగా జిల్లాలో సగటున 17.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా కురుపాంలో 50.8, భామిని 42.4, సీతంపేటలో 25.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం వర్షాల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.