మాటల్లో తీపి..చేతల్లో చేదు
● సుగర్ ఫ్యాక్టరీల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టత కరువు ● రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శికి భీశెట్టి వినతిపత్రం
విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో కీలకమైన తాండవ, ఏటికొప్పాక, తుమ్మపాల, భీమసింగి సుగర్ ఫ్యాక్టరీల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వం విధానమేమిటో ప్రకటించాలని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్మి ఎన్.యువరాజును విన్నవించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో యువరాజుతో ఆయన సమావేశమై ఉత్తరాంధ్రలోని సహకార చక్కెర కర్మాగారాల కార్మికులు, ఉద్యోగులు, రైతులు పడుతున్న ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ..గడిచిన ఐదేళ్లుగా భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు వారికి రావాల్సిన పీఎఫ్, గ్రాట్యుటీ యాజమాన్యం చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, కొంతమంది కార్మికులు ఆకలి, ఆవేదనతో ఆందోళన చెంది చనిపోగా, వారి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. తాండవ, ఏటికొప్పాక, అనకాపల్లి, సుగర్ ఫ్యాక్టరీల పరిధిలో రైతులకు ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉందని, భీమసింగి సుగర్ ఫ్యాక్టరీకి ఆ పరిస్థితి లేదని, రాష్ట్ర ప్రభుత్వం అసలు సుగర్ ఫ్యాక్టరీలను నడుపుతుందో, మూసేస్తుందో ప్రకటించకుండా రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోందన్నారు.
వెంటనే బకాయిలు చెల్లించాలి
నాలుగు ఫ్యాక్టరీల కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.35 కోట్లు ఉండవచ్చునని ఫ్యాక్టరీల్లో ఉన్న యంత్ర పరికరాలను అమ్మేసి ప్రభుత్వం వెంటనే కార్మికులు, రైతుల,ఉద్యోగుల బకాయిలు చెల్లించవచ్చని అభిప్రాయపడ్డారు. మూతపడిన సుగర్ ఫ్యాక్టరీల స్ధానంలో ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుందని భీశెట్టి అభిప్రాయపడ్డారు. కార్మికుల బకాయిలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని యువరాజు హామీ ఇచ్చినట్లు భీశెట్టి తెలిపారు.


