చిరుద్యోగులపై అక్కసు ఎందుకు?
పార్వతీపురంటౌన్: ఎన్నికల సమయంలో ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వేతన సమస్యలు పరిష్కరిస్తామని, అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.. తీరా అధికారం చేపట్టాక కనీసం ఒక్కటంటే ఒక్కహామీని నెరవేర్చలేదు.. చిరుద్యోగులంటే ఎందుకంత అక్కసు అంటూ నేతలను ప్రశ్నిస్తున్నారు. సమస్యలు, డిమాండ్లు, హామీలు నెరవేర్చాలంటూ పలు సార్లు ఆందోళనలు చేసినా స్పందించకపోవడంతో ఈ నెల 20న సమ్మెకు సిద్ధమవుతున్నారు. అధికారులకు నోటీసులు అందజేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసేందుకు రాష్ట్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొంటున్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికుల నియామకాల్లో రాజకీయ నాయకుల ఆధీనంలోని ప్రైవేట్ ఏజన్సీల ప్రభావం పెరుగుతుందని వాపోతున్నారు. ఇది ఒక రకంగా అర్హత కలిగిన వారికి ఉద్యోలు పొందే అవకాశం కోల్పోయేలా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ప్రతినెలా జీతాలు సకాలంలో పొందే అవకాశం పోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం అమలవుతున్న ఆప్కాస్ విధానాన్ని కొనసాగించాలని, రెగ్యులర్ ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆశ వర్కర్ల తీవ్రమైన అన్యాయం
జిల్లా వ్యాప్తంగా 2,163 మంది ఆశవర్కర్లు ఉద్యోగ భద్రత కల్పించాలని పదినెలలుగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నా ఫలితం లేదు. కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశలుగా మార్పుచేసేలా జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధనకు కార్మిక సంఘాల పిలుపుమేరకు పీహెచ్‌సీలలో వైద్యాధికారులకు సమ్మెకు సంబంధించిన నోటీసులు అందజేస్తున్నారు.
పోరుబాటలో సీహెచ్‌డబ్ల్యూఓలు
జిల్లా వ్యాప్తంగా 1676 మంది సీహెచ్‌డబ్ల్యూలు ఉన్నారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో జరిగే సమావేశాలకు హాజరైనప్పుడు కనీసం టీఏ, డీఏలు ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. సమస్యల పరిష్కారానికై ఈనెల 20న సమ్మెబాట పట్టనున్నారు.
ఎండీఎం కార్మికులపై రాజకీయ ఒత్తిళ్లు
జిల్లా వ్యాప్తంగా 2,300మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. సకాలంలో భోజన బిల్లులు విడుదల చేయకపోయినా అప్పుచేసి విద్యార్థులకు రుచికరమైన భోజనాలు వడ్డిస్తున్నారు. ఇటీవల రాజకీయ నాయకులు కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఉద్యోగానికి భరోసా కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలు పాఠశాలల్లో టీడీపీ నాయకులు సిఫార్సులు చేసిన వారిని నియమించి ఏళ్ల తరబడి పనిచేస్తున్నవారిని తొలగిస్తున్నారని మండిపడుతున్నారు. సమ్మెకు సిద్ధమవుతున్నారు.
లేబర్ కోడ్‌లు రద్దుచేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేసిన లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దుచేయాలి. సమాన పనికి సమాన వేతనం కల్పించి వారికి ఉద్యోగభద్రత కల్పించాలి. ఒప్పంద జీఓలు తక్షణమే విడుదల చేయాలి. ఆప్కాస్ విధానాన్ని కొనసాగిస్తూ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించాలి. కార్మికుల, చిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈనెల 20న సమ్మెబాట పట్టనున్నారు. సమ్మెను పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. ఉద్యోగులు, చిరుద్యోగు లు, కార్మికులందరూ సహకరించాలి.
– గొర్లి వెంకటరమణ,
సీఐటీయూ జిల్లా నాయకుడు
కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న చిరుద్యోగులు
సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు
సమ్మెబాటలో ఆశ, సీహెచ్‌డబ్ల్యూ, ఎండీఎం వర్కర్లు
అధికారులకు సమ్మెనోటీసులు
చిరుద్యోగులపై అక్కసు ఎందుకు?


