పాలకొండ టికెట్‌ జనసేనకే..! | Sakshi
Sakshi News home page

పాలకొండ టికెట్‌ జనసేనకే..!

Published Mon, Jan 8 2024 12:44 AM

- - Sakshi

పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం టీడీపీలో టికెట్‌ ఎవరికి ఇస్తారో తెలియని గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ టీడీపీ గ్రూపుల గోలతో తరచూ రచ్చకెక్కుతుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్ధకంగా మారింది. పాలకొండ టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న వర్గ పోరు గతేడాది జూలై 12న చంద్రబాబు చేపట్టిన బస్సుయాత్రలో బహిర్గతమైంది. బస్సు యాత్రకు వచ్చిన చంద్రబాబు వీరఘట్టం అంబేడ్కర్‌ జంక్షన్‌లో బహిరంగ సభలో మాట్లాడారు.

టీడీపీ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరు ప్రకటిస్తారని అతని వర్గీయులు ఆశించారు. అయితే చంద్రబాబు కనీసం జయకృష్ణ పేరు ప్రస్తావించకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీంతో నియోజకవర్గంలో ఉన్న నిమ్మక జయకృష్ణ, పడాల భూదేవి వర్గీయులు చాపకింద నీరులా ఒకరిపై ఒకరి కత్తులు దూసుకుంటున్నారు. వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ టీడీపీలో వీరు వర్గపోరుకు బీజం పోస్తున్నారని టీడీపీ సీనియర్‌ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ వర్గ పోరుకు టీడీపీ అధిష్టానం చెక్‌ పెట్టేందుకు ఇక్కడ ప్రత్యామ్నాయంగా జనసేన అభ్యర్థికి టికెట్‌ ఇస్తారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది.

తమ అభ్యర్థులకు వ్యతిరేకత ఉన్నచోట జనసేనకు టికెట్లు ఇచ్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు టీడీపీ నాయకులే చెబుతుండడం గమనార్హం. ఇక్కడ జనసేనకే టికెట్‌ ఇస్తే ఇన్నాళ్లు టీడీపీని నమ్ముకున్న నిమ్మక జయకృష్ణకు నిరాశ తప్పదని, భూధేవికి భంగపాటే మిగులుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏది ఏమైనా పాలకొండ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి గెలుపు తథ్యమని, ఈమె హ్యట్రిక్‌ విజయం సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈమె హయాంలోనే పాలకొండ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.

ఫోన్‌ కాల్స్‌ కలకలం
పాలకొండ టీడీపీ టికెట్‌ ఎవరికిస్తే బాగుంటుందని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాయిస్‌తో వచ్చిన ఫోన్‌ కాల్స్‌ టీడీపీలో కలకలం రేపాయి. ఇవి బోగస్‌ ఫోన్స్‌ కాల్స్‌ అని టీడీపీలో ఓ వర్గం కొట్టిపడేసింది. ఇదిలా ఉండగా 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు ఇక్కడ టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఇందులో 2004, 2009లో మాజీ ఎమ్మెల్యే దివంగత నిమ్మక గోపాలరావు టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వరుసగా 2014, 2019లలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిపై గోపాలరావు తనయుడు జయకృష్ణ టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఇక 2024లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి గెలుస్తుందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి.

Advertisement
Advertisement