● అదును చూసి.. చదునుచేసి..
ఆక్రమణల్లో నెల్లి చెరువు
దర్జాగా కబ్జా
చెరువు భాగంలో వ్యర్థాలు పోసి యంత్రంతో చదును చేస్తున్న దృశ్యం
సాక్షి, పార్వతీపురం మన్యం:
పార్వతీపురం పట్టణం నడిబొడ్డున ఉన్న నెల్లి చెరువు ఆక్రమణలతో రూపుకోల్పోతోంది. ఇప్పటికే ఆక్రమణలతో చిక్కిపోయిన చెరువు గర్భాన్ని.. మరింత మంది కబ్జా చేసేందుకు వీలుగా అధికారులే ఊతమిస్తున్నట్లుంది. స్థానిక డంపింగ్‌యార్డు వద్ద రీసైకిల్ చేసిన వ్యర్థాలను గతంలో ఇక్కడ వేసేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించిన విషయం విదితమే. దీనిని చెరు వు సమీపంలో అక్రమంగా ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదలు అడ్డుకున్నారు. తర్వాత వీరిని భయపెట్టి, బెదిరించి మున్సిపల్ సిబ్బంది దారిలోకి తెచ్చుకున్నారు. గొడవలు సద్దుమణగడంతో రీసైక్లింగ్ వ్యర్థాలను పట్టపగలే నెల్లి చెరువులో వేసి, యంత్రాలతో చదును చేస్తున్నారు. పట్టణ నడిబొడ్డున సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన నెల్లి చెరువు.. ఇప్పటికే చాలా వరకు ఆక్రమణలకు గురైంది. ప్రస్తుతం ఐదెకరాలకే పరిమితమైంది. చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలు ఇప్పటికీ జోరుగా సాగుతున్నాయి. అక్రమ కట్టడాలంటూ కొంతమందికి నోటీసులిస్తున్నా.. అందులోనూ వివక్ష.. రాజకీయ కక్ష ఉందన్న విమర్శలున్నాయి. తాజాగా చెరువు పూర్తిగా రూపు కోల్పోయేలా వ్యర్థాలతో చదును చేస్తుండడం వెనుక కూడా కబ్జాల పన్నాగం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.


