న్యూస్‌రీల్
పంచాయతీ నామినేషన్ల రెండవ రోజూ టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలు వైఎస్సార్ సీపీ మద్దతుదారుల నామినేషన్ పత్రాలు చించివేత నామినేషన్ కేంద్రాలు ఉన్న గ్రామాల్లోకి రాకుండా అడ్డగింత పచ్చమూకలకు పోలీసుల వత్తాసు పచ్చ గూండాలు, పోలీసుల అడ్డంకులు దాటుకుని నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులు
నామినేషన్ కేంద్రంలోనే పత్రాలు చించివేత
నామినేషన్ల పర్వంలో కొనసాగిన టీడీపీ గూండాయిజం
మంగళవారం శ్రీ 17 శ్రీ నవంబర్ శ్రీ 2026
నరసరావుపేట రూరల్: పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో రెండో రోజు పచ్చమూకల అరాచకం కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద సోమవారం కూడా పచ్చమూకలు స్వెర విహారం చేశారు. వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయాలంటే యుద్ధమే చేయాల్సివస్తుంది. పచ్చమూకలు, రౌడీషీటర్లు, గంజాయి బ్యాచ్‌లతో పాటు పోలీసుల మీద పోరాడి నామినేషన్‌లను దాఖలు చేస్తున్నారు. కొన్ని చోట్ల పచ్చమూకలు నామినేషన్లు లాక్కుని చించివేశారు. మరి కొన్ని చోట్ల నామినేషన్ వేయడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు.
కోటయ్య సాక్షిగా అక్రమాలు
కోటప్పకొండలో పమిడిమర్రు, కొండకావూరు, చింతలపాలెం పంచాయతీలకు నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే ఆ కేంద్రం వద్ద నరసరావుపేటకు చెందిన 30మంది రౌడీమూకలు రెండు రోజులుగా తిష్టవేశారు. పమిడిమర్రు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ బలపరిచిన గర్నెపూడి ముసలయ్య ఆదివారం నామినేషన్ దాఖలు చేయగా, సోమవారం నలుగురు వార్డు సభ్యుల నామినేషన్లను పచ్చరౌడీలు అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ బలపరిచిన కొండకావూరు అభ్యర్థి, చింతలపాలెం సర్పంచ్ అభ్యర్థి దాసరి రాణమ్మ పాటు పమిడిమర్రు వార్డు సభ్యులు నామినేషన్‌కు సోమవారం కోటప్పకొండకు రాగా అప్పటికే అక్కడ ఉన్న పచ్చగూండాలు వీరిని నామినేషన్ కేంద్రానికి రాకుండా అడ్డుకున్నారు. అభ్యర్థులు నామినేషన్ కేంద్రం వైపు వెళ్లేందు కు ప్రయత్నించగా రాళ్లు రువ్వారు. దీనిని వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రతిఘటించారు. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు వైఎస్సార్ సీపీ శ్రేణులను నామినేషన్ కేంద్రం నుంచి దూరంగా పంపించివేయడంపై చూపరులు ముక్కున వేలేసుకున్నారు.
రాళ్లు, సీసాలు, కర్రలతో స్వైరవిహారం
చినతురకపాలెంలో వైఎస్సార్ సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి షేక్ నన్ను తహీరున్ నామినేషన్ దాఖలు చేసేందుకు మద్దతుదారులతో యల్లమంద బయలుదేరగా, యల్లమంద బ్రిడ్జి వద్ద పచ్చమూకలు వీరిని అడ్డుకున్నాయి. కర్రలు, రాడ్‌లతో రోడ్ల మీద హల్‌చల్ చేశారు. దీంతో సర్పంచ్ అభ్యర్ధితో పాటు వార్డు సభ్యులు ముందుకు వెళ్లలేక వెనుదిరిగారు.
చింతలపాలెం సర్పంచ్ అభ్యర్థి దాసరి రాణమ్మతో పాటు వార్డు సభ్యుల నామినేషన్ పత్రాలను లాక్కుని పచ్చమూకలు పరారయ్యారు. పోలీసుల ఎదుటే దౌర్జన్యం చేసినా వారు స్పందించకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్లూరివారిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ బలపరచిన కందుకూరి వెంకాయమ్మ ఆదివారం నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లగా ఆమె నుంచి పచ్చమూకలు నామినేషన్ పత్రాలు లాక్కుని చించివేశారు. దీంతో సోమవారం మద్దతుదారులతో కలిసి కేంద్రానికి వెళ్లగా టీడీపీ గూండాలు మళ్లీ అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రతిఘటించి అభ్యర్థులను నామినేషన్ కేంద్రంలోకి పంపించారు. అల్లూరివారిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ బలపరిచిన యేరువ అంజనారెడ్డి పాలపాడు నామినేషన్ కేంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు. పెద్దరెడ్డిపాలెం సర్పంచ్ అభ్యర్ధి భవనం ప్రభావతితో పాటు వార్డు సభ్యులు నామినేషన్ వేసేందుకు కేంద్రానికి వెళ్తుండగా పమిడిపాడు శివారులో పచ్చమూకలు అడ్డగించి వెనక్కి పంపించారు. కేఎం అగ్రహరం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ బలపరిచిన దరువూరి రామేశ్వరమ్మ నామినేషన్ దాఖలు చేశారు.
నరసరరావుపేట: రొంపిచర్ల మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. పోలీసులు కూడా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేసేందుకు పలు అడ్డంకులు సృష్టించారు. కర్లకుంటలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన సంతగుడిపాడు వైఎస్సార్ సీపీ మద్దతుదారులను గ్రామం వెలుపలే కిరాయి గూండాలతో అడ్డగించారు. ప్రభుత్వం మాది, అధికారం మాది, అధికారం ఉన్నన్ని రోజులు మేమే సర్పంచులం, వచ్చిన దారిలో వెళ్లండి లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సంతగుడిపాడు టీడీపీ నాయకులు, కిరాయి గుండాలతో బెదిరించారు. బీసీ వర్గానికి చెందిన అభ్యర్ధి ఒంటిపులి శ్రీను వద్ద నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేశారు. అలాగే మాచవరం నుంచి నామినేషన్ వేసేందుకు బయలుదేరిన వైఎస్సార్ సీపీ మద్దతు అభ్యర్థులను గ్రామశివారులోనే పోలీసులు అడ్డుకున్నారు. అతికష్టం మీద నామినేషన్లు వేసేందుకు పరగటిచర్ల గ్రామం చేరుకుంటే ఊరి ప్రారంభంలోనే కిరాయిగుండాలు, పోలీసులు మరోసారి అడ్డగించారు. దీంతో మహిళా అభ్యర్ధులతో పాటు మద్దతుదారులు స్మశాన వాటిక చెట్ల కిందే పడికాపులు కాశారు. సాయంత్రం 4గంటల సమయంలో పోలీసుల వెళ్లిపోయిన తరువాత అభ్యర్ధులు నామినేషన్ కేంద్రం వైపు వెళ్లారు. వీరిని అడ్డుకునేందుకు కిరాయి మూకలు ప్రయత్నించగా ప్రతిఘటించడంతో వారు పరారయ్యారు. అనంతరం కేంద్రంలోకి వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. విప్పర్ల నామినేషన్ కేంద్రంలో వి.రెడ్డిపాలెం వైఎస్సార్ సీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్ధిగా దుద్దుగుంట యోగిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మాచవరం సర్పంచ్ అభ్యర్ధిగా యేరువ శ్రీనివాసరెడ్డి పరగటిచర్లలో నామినేషన్ వేశారు.
పెద్దతురకపాలెంలో వైఎస్సార్ సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి షేక్ మస్తాన్‌వలి కేసానుపల్లిలో నామినేషన్ వేసేందుకు వెళ్లగా పచ్చమూకలు నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేశారు. నామినేషన్ కేంద్రం సిబ్బంది మస్తాన్‌వలికి ఎల క్షన్ డిపాజిట్ నగదు తీసుకుని రశీదు కూడా ఇచ్చారు. ఆ సమయంలో టీడీపీ గూండాలు నామినేషన్ కేంద్రంలోకి వచ్చి నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేశాయడం గమనార్హం.


