‘పేట’ పోరుకు సై! | - | Sakshi
Sakshi News home page

‘పేట’ పోరుకు సై!

Nov 13 2026 4:11 AM | Updated on Nov 13 2026 4:11 AM

నరసరావుపేట మున్సిపాల్టీ ఎన్నికకు నోటిఫికేషన్‌

రేపటి నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరణ 26న పోలింగ్‌, 30న కౌంటింగ్‌

నరసరావుపేట: మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగింది. జిల్లా కేంద్ర ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఎన్నికలకు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పచ్చజెండా చూపింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీవరకు మూడురోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 17వ తేదీన నామినేషన్లు పరిశీలన ఉంటుంది. 19వ తేదీలోగా వాటి ఉపసంహరణకు రెండురోజులు అవకాశం ఇచ్చారు. పోలింగ్‌ ఈనెల 26న నిర్వహించి, నాల్గవ రోజు 30వ తేదీన కౌంటింగ్‌ నిర్వహిస్తారు. కౌంటింగ్‌ నిర్వాహణకు చిలకలూరిపేట రోడ్డులోని ఎస్‌ఆర్‌కేటీ జంక్షన్‌ సమీపంలోని కే రిడ్జ్‌ స్కూలును ఎంపిక చేశారు. పోలింగ్‌ నిర్వహించేందుకు 116 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

టీడీపీ వల్లే ఎన్నికలు ఆలస్యం

2014లో 34 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా 18 వార్డులు టీడీపీ, 15 వార్డులు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు గెలుచుకోగా, ఒక వార్డులో సీపీఐ అభ్యర్థి గెలుపొందాడు. చైర్మన్‌గా నాగసరపు సుబ్బరాయగుప్తా వ్యవహరించారు. ఆ పాలకవర్గం కాలపరిమితి ముగిసిన అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పట్టణ చుట్టుపక్కల ఉన్న ఐదు పంచాయతీలు కేసానుపల్లి, యల్లమంద, ఇసప్పాలెం, రావిపాడు, లింగంగుంట్ల గ్రామాలకు చెందిన కొంత ప్రాంతాన్ని పురపాలకసంఘంలో కలిపి 38వ వార్డులుగా విభజించారు. తమకు వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో టీడీపీకి చెందిన పలువురు వ్యక్తులు పంచాయతీల విలీనం శాస్త్రబద్ధంగా జరగలేదని, ఓటర్ల కూర్పు సక్రమంగా చేయలేదని హైకోర్టును ఆశ్రయించటంతో ఎన్నికల నిర్వాహణపై కోర్టు స్టే మంజూరు చేసింది. అప్పుడు వేసిన కోర్టు కేసులు ఇటీవలే పిటిషన్‌దార్లు ఉపసంహరించుకోవటంతో ఐదేళ్ల అనంతరం ఎన్నికలకు సిద్ధమైంది. అయితే 2022లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించటంతో జనాభా పెరిగి ఇప్పుడు 1.45లక్షలకు చేరింది. దీంతో పాటు పురపాలకసంఘాన్ని ప్రత్యేక గ్రేడుగా పరిగణించటంతో వార్డులను 48 వార్డులుగా విభజించారు. వాటిలో 13 వార్డులను మహిళలకు, 19 వార్డులు బీసీలు, నాలుగు వార్డులు ఎస్‌సీలు, ఒక వార్డు ఎస్‌టీ, మిగతా 11వార్డులను అన్‌రిజర్వ్‌డుగా ప్రకటించారు. ఎన్నికలకు ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, జనసేన, వామపక్షాలు సిద్ధమయ్యాయి. తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు ఆయా పార్టీల నాయకులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement