రాకపోకలు నిలిపివేత
బుధవారం పెదమద్దూరు వాగు ఉధృతి పెరిగి, రోడ్డుపై సుమారు నాలుగు అడుగుల మేర నీరు ప్రవహించడంతో అమరావతి–విజయవాడ మధ్య రాకపోకలను నిలిపివేశారు. పెదమద్దూరు నుంచి అమరావతి వచ్చే రోడ్డుపై వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు కొంతమేర కోతకు గురైంది. హఠాత్తుగా కొన్ని గంటల్లోనే అత్యంత భారీ వర్షాలు కురవడం, అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు రావడంతో పంటలు నీటమునిగి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకుని, సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు.
2,555 హెక్టార్లలో వరి పంట నష్టం
● వాగుల వెంట 10 గ్రామాల్లో
వరద నీటిలో పంట పొలాలు
● సుమారు మూడు వేల
ఎకరాల్లో పంటలకు నష్టం
● అమరావతి–విజయవాడ మధ్య
నిలిచిన రాకపోకలు
● తీవ్రంగా నష్టపోయిన రైతులు
యడ్లపాడు: చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో తక్కువ సమయంలోనే అధిక వర్షపాతం నమోదవడంతో పంటచేలు ముంపునకు గురయ్యాయని, రోడ్లు ధ్వంసమయ్యాయని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. బుధవారం ఆమె యడ్లపాడు మండలంలో పర్యటించారు. తిమ్మాపురం వద్ద జాతీయ రహదారి అండర్‌పాస్ వద్ద వరదనీటిలో చిక్కుకుని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. యడ్లపాడులో రైతులతో మాట్లాడి పంటనష్టం వివరాలను తెలుసుకున్నారు. పంటనష్టం అంచనా కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభిస్తామన్నారు. తిమ్మాపురం వద్ద జాతీయ రహదారి అండర్‌పాస్ వద్ద వరద ముంపునకు గురవుతున్న డ్రైనేజీ వ్యవస్థను మార్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రోడ్లకు అడ్డంగా పడిన చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నట్లు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతోపాటు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం సొలసలో దెబ్బతిన్న చెరువు కట్టను పరిశీలించారు. జాలాదిలోని పునరావాస కేంద్రంలో వరద బాధితులకు కలెక్టర్ భోజనం వడ్డించారు.
యడ్లపాడు: మురసు తుఫాన్ ప్రభావం కారణంగా పెదనందిపాడు బ్రాంచ్ కెనాల్ 19 నుంచి 36 కి.మీ. వరకు పలు ప్రాంతాల్లో గండ్లు పడి భారీ నష్టం సంభవించింది. ప్రధానంగా నక్కవాగు, ఉప్పువాగు నుంచి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో పెదనందిపాడు బ్రాంచ్ కెనాల్ కట్టలు పలు చోట్ల కోతకు గురై దెబ్బతిన్నాయి. ఈ నష్టాలను బుధవారం సూపరింటెండెంట్ ఇంజినీర్ రమేష్ , డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జునరావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చిన్నరాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు రూ.80 లక్షల మేర నష్టం జరిగినట్లు భావిస్తున్నామని చెప్పారు. మరమ్మతు పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు.
ఉధృతంగా కుప్పగంజి వాగు
నాదెండ్ల: మేజర్ పంచాయతీ గణపవరంలో కుప్పగంజివాగు ఉగ్రరూపం దాల్చింది. వాగు సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరాయి. ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. పొలాలు నీట మునిగాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది.
అమరావతి: మురసు తుఫాన్ దెబ్బకు కురిసిన భారీ వర్షాలతో పూర్తిగా మునిగిన కంది పైరు
రొంపిచర్ల: జిల్లాలో వరి రైతులు అతలాకుతలం అయ్యారు. 2,555 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. నకరికల్లు, రొంపిచర్ల, చిలకలూరిపేట, రాజుపాలెం, ఈపూరు తదితర మండలాల్లో బావులు, బోర్లపై ఆధారపడి వరి సాగు చేశారు. ప్రస్తుతం ఈ పైరు కంకి బిర్రు, పొట్ట దశలో ఉంది. తుఫాన్ గాలులకు పైరంతా నేలవాలింది. దీంతో కంకులన్నీ తాలు కంకులుగా మారుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నరసరావుపేటరూరల్: దెబ్బతిన్న పంటలను జిల్లా ఉద్యాన శాఖాధికారి ఐ. వెంకట్రావు బుధవారం పరిశీలించారు. జిల్లాలో 1,457 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు వెల్లడించారు. చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల, నరసరావుపేట, రొంపిచర్ల, సత్తెనపల్లి, శావల్యాపురం, వినుకొండ మండలాల్లో ఉద్యాన పంటలకు అధికంగా నష్టం జరిగినట్లు తెలిపారు. 1,037 హెక్టార్లలో మిరప, 66 హెక్టార్లలో అరటి, 67 హెక్టార్లలో పూలతోటలు, 9.40 హెక్టార్లలో కంద, 2.20 హెక్టార్లలో పసుపు, 4 హెక్టార్లలో జామ, 70.40 హెక్టార్లలో బొప్పాయి, 14.83 హెక్టార్లలో నిమ్మ పంటలకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు.


