విద్యుత్‌శాఖకు రూ.1.2 కోట్లు తుఫాన్‌ నష్టం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌శాఖకు రూ.1.2 కోట్లు తుఫాన్‌ నష్టం

Nov 5 2026 2:04 AM | Updated on Nov 5 2026 2:04 AM

నరసరావుపేట: మురసు తుఫాన్‌ కారణంగా జిల్లాలో విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తమై సుమారు రూ.1.2 కోట్ల నష్టం వాటిల్లిందని విద్యుత్‌శాఖ జిల్లా సూపరింటెండెంట్‌ ఇంజినీరు నల్లూరి మస్తాన్‌రావు తెలిపారు. పట్టణంలోని రామిరెడ్డిపేటలో జరుగుతున్న విద్యుత్‌ పునరుద్ధరణ పనులను రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయిన గొట్టిపాటి రవికుమార్‌, స్థానిక శాసనసభ్యులు డాక్టర్‌ చదలవాడ అరవిందబాబుతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ తుఫాన్‌ కారణంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా బలమైన గాలులతో కురిసిన వర్షం కారణంగా జిల్లాలోని నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో పెద్ద చెట్లు, హోర్టింగ్‌లు కూలిన కారణంగా విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 33 కేవీలో ఎనిమిది ఫీడర్లకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. వాటిలో ఏడు ఫీడర్లకు బుధవారం ఉదయంకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించామని తెలిపారు. అలాగే 11కేవీలో 63 ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన 41 ట్రాన్స్‌ఫార్మర్లకు హుటాహుటీన మరమ్మతులు చేసి పునరుద్ధరించామన్నారు. 11 కేవీలో విద్యుత్‌ స్తంభాలు 149, 33 కేవీలో విద్యుత్‌ స్తంభాలు 12, ఎల్‌టీలో స్తంభాలు 99 పడిపోయాయని వెల్లడించారు. వాటికి ఉన్న 18 కిలోమీటర్ల మేర తీగెలు దెబ్బతిన్నాయన్నారు. అన్ని గ్రామాలకు పూర్తిస్థాయిలో విద్యుత్‌ సౌకర్యం కల్పించామన్నారు.

ఈఈ సీహెచ్‌. రాంబొట్లు, డీఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

యడ్లపాడులో అత్యధికంగా 291.0 మిల్లీమీటర్ల వర్షం

నరసరావుపేట: మురసు తుఫాన్‌ ప్రభావంతో చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలంలో అత్యధికంగా 291.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 2381.2 మి.మీ వర్షం పడగా, జిల్లా సరాసరి సగటు వర్షం పాతం 85.0గా నమోదైంది. కురిసిన వర్షంకు సంబందించిన రెవెన్యూ రెయిన్‌ఫాల్‌ రిపోర్టును అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు నాదెండ్లలో 249.0 మి.మీ, చిలకలూరిపేటలో 243.4, నరసరావుపేటలో 185.2, ముప్పాళ్ల 56.8, రొంపిచర్ల 82.2, ఈపూరు 29.8, శావల్యాపురం 66.4, నూజెండ్ల 36.4, వినుకొండ 69.4, బొల్లాపల్లి 24.8, నకరికల్లు 74.2, రాజుపాలెం 84.4, సత్తెనపల్లి 174.6, పెదకూరపాడు 166.6, అమరావతి 122.2, క్రోసూరు 96.8, అచ్చంపేట 68.2, బెల్లంకొండ 66.4, మాచవరం 42.2, పిడుగురాళ్ల 47.8, కారెంపూడి 22.8, దాచేపల్లి 10.0, రెంటచింతల 10.2, దుర్గి 7.0, వెల్దుర్తి 9.6, మాచర్ల 9.6 మి.మీ వర్షం కురిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement