ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం

Nov 5 2026 2:04 AM | Updated on Nov 5 2026 2:04 AM

సర్కారు తీరు మరీ దారుణం నరసరావుపేట: రెండో ఫేజ్‌లో జరగబోయే నరసరావుపేట మున్సిపల్‌ ఎన్నికల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సూచించిన విధంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం వారికి తీవ్ర అన్యాయం చేసిందని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ల కేంద్రాన్ని కలెక్టరేట్‌లో కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు పలువురు ఎస్సీ నాయకులతో కలిసి బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌కు, కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు విన్నవించారు. ఈ మేరకు డీఆర్‌ఓ కె. అద్దెయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన కౌన్సిలర్‌ సీట్ల కేటాయింపు రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరిగిందని చెప్పారు. భారత రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఈ కేటాయింపులు జరిగాయని అన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు పాటించాలని, అయితే ప్రస్తుతం వాటిలో 50 శాతం సీట్లకు కోత విధించారని తెలిపారు. గతంలో 38 వార్డులు ఉన్నప్పుడు ఎస్సీలకు నాలుగు సీట్లు, ఎస్టీ సోదరులకు ఒక సీటు కేటాయించారని గుర్తుచేశారు. ప్రస్తుతం 10 వార్డులు పెంచి మొత్తం 48 వార్డులు చేశారని, ఆ దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సుమారు 12 సీట్లు కేటాయించాల్సి ఉందన్నారు. అయితే, కంటితుడుపు చర్యగా ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు ఒకటి చొప్పున మొత్తం ఐదు సీట్లు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. పట్టణంలోని పాత ఆరు, ఏడు వార్డులు ఎస్సీలకు సంబంధించినవని, ఎంతోకాలంగా వాటిని ఎస్సీలకు కేటాయిస్తున్నారని తెలిపారు. అయితే, ఈసారి ఆ వార్డుల కేటాయింపులను మార్చారని, జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ వార్డుల్లో సుమారు 1,400 నుంచి 1,500 మంది వరకు ఎస్సీలు నివసిస్తున్నప్పటికీ, వాటిని ఎస్సీలకు కేటాయించలేదని అన్నారు. బౌండరీల ప్రకారం వార్డులను రూపొందించామని అధికారులు చెబుతున్నారని తెలిపారు. అయితే, కూటమికి అనుకూలంగా ఉన్న ఓట్లు ఉన్నచోట బౌండరీలు దాటి ఓటర్లను కలిపారని, తమ పార్టీకి చెందిన వారి ఓట్లు ఉన్నచోట బౌండరీలో ఉన్నవారిని వేరే చోటకు కేటాయించారని ఆరోపించారు. ఆరో వార్డులోని మెయిన్‌ లైన్‌లో ఉన్న ఓట్లను నాలుగో వార్డులోని నిమ్మతోటలో కలిపారని, ఈ మార్పులు కూడా ఒక లైన్‌ ప్రకారం కాకుండా అక్కడక్కడ ఓట్లను తొలగిస్తూ చేశారని అన్నారు. కూటమి నేతలకు అనుకూలంగా ఉండేలా ఓటరు జాబితాను తయారు చేయడం దారుణమని పేర్కొన్నారు. ఓటరు జాబితాను తక్షణమే సరిచేయాలని, రిజర్వేషన్ల కేటాయింపు అంశాన్ని పునఃపరిశీలించి సవరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తాము బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని తెలిపారు. ఓటరు జాబితాను గందరగోళంగా తయారు చేశారని, పైన ఇండెక్స్‌లో చూపించిన డోర్‌ నంబర్లకు, ఓటరు జాబితాలోని డోర్‌ నంబర్లకు తేడా ఉందని అన్నారు. నామినేషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్సార్‌ సీపీ తరఫున తమ అభ్యర్థులందరూ నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయంలో నామినేషన్‌ కేంద్రం ఉన్నప్పటికీ, అదనంగా కలెక్టర్‌ కార్యాలయంలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని పేర్కొన్నారు.

పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి కందుల ఎజ్రా మాట్లాడుతూ, గతంలో 38 వార్డులకు నాలుగు వార్డులు ఎస్సీలకు కేటాయించగా, ఇప్పుడు 48 వార్డులకు కూడా నాలుగు వార్డులే కేటాయించడం దారుణమని అన్నారు. పట్టణంలో ఎస్సీలు అధికంగా ఉన్నందున కనీసం ఏడు వార్డులైనా కేటాయించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌. సుజాతాపాల్‌ మాట్లాడుతూ, రిజర్వేషన్లను సక్రమంగా పాటించాలని, పట్టణంలో ఎస్సీలు అధికంగా ఉన్నందున వారి జనాభాకు అనుగుణంగా కౌన్సిలర్‌ సీట్ల కేటాయింపులో తగిన న్యాయం జరగాలని అన్నారు. లేనిపక్షంలో కూటమి ప్రభుత్వం వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్‌ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అంబేడ్కర్‌ రాజ్యాంగానికి తూట్లు పొడిచిందన్నారు. పట్టణంలోని ఆరు, ఏడు వార్డుల్లో ఎస్సీలు అధికంగా ఉన్నప్పటికీ, ఆ వార్డులను కావాలనే వేరే సామాజిక వర్గానికి కేటాయించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

రిజర్వేషన్లలో
సర్కారు తీరు మరీ దారుణం

తీరని అన్యాయం

ఓటరు జాబితాలోనూ..

రాజ్యాంగ నిబంధనలకు

కూటమి ప్రభుత్వం తిలోదకాలు

ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు

7.5 శాతం సీట్లు కేటాయించలేదు

కేవలం 50 శాతం మాత్రమే

కేటాయింపు

నామినేషన్‌ సెంటర్‌ను కలెక్టరేట్‌లో

కూడా ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement