పోలింగ్‌కు సర్వం సిద్ధం
● జిల్లాలో 10 జెడ్పీటీసీలు,
37 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
● బరిలో 117 మంది అభ్యర్థులు
సత్తెనపల్లి: జిల్లాలో మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలకు జరగనున్న ఎన్నికల సమరానికి వేళైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎన్నికల పరిశీలకురాలు శ్రీవాస్‌నుపుర్ ఆధ్వర్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జిల్లా జేసీ, జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంజనా శ్రీహర్ష తదితరుల బృందం పోలింగ్‌కు కసరత్తు పూర్తి చేసింది. అలాగే ఎక్కడా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. 567 పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఇందులో 177 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వెబ్‌కాస్టింగ్ సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 3,877 మంది సిబ్బందిని నియమించారు. నరసరావుపేటలోని ఏఎంఎస్ రెడ్డి కళాశాలలో 7న ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు పూర్తి చేశారు. అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు.
ఏకగ్రీవం ఇలా..
జిల్లాలోని 28 జెడ్పీటీసీ స్థానాలకు గాను 18 ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన స్థానాల్లో నరసరావుపేట, రొంపిచర్ల, మాచర్ల, కారంపూడి, దుర్గి, రెంటచింతల, వెల్దుర్తి, పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, వినుకొండ, బొల్లాపల్లి, ఈపూరు, శావల్యాపురం, చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు ఉన్నాయి. మిగిలిన 10 జడ్పీటీసీ స్థానాలకు మాత్రమే గురువారం ఎన్నికలు జరగనున్నాయి. అవి గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు, వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల, పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలాలు. జిల్లాలోని 419 ఎంపీటీసీ స్థానాలకు గాను 382 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 37 స్థానాలకు 87 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. జిల్లాలోని సత్తెనపల్లి మండలంలో 21, ముప్పాళ్ల మండలంలో 9, రాజుపాలెం మండలంలో 1, నకరికల్లు మండలంలో 1, చిలకలూరిపేట మండలంలోని వేలూరులో 1, నూజెండ్ల మండలంలో 4 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటరు స్లిప్పుల పంపిణీ కూడా పూర్తయింది.
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం నిర్వహించనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ సంజనా శ్రీహర్షతో కలిసి విధులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలందరూ ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
– డాక్టర్ కృతికా శుక్లా ,జిల్లా కలెక్టర్


