గురజాలలో మరీ దారుణం
● వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు.. ఏజెంట్లకు బెదిరింపులు
● ప్రచారం చేయవద్దంటూ
నేరుగా హెచ్చరిస్తున్న పోలీసులు
● ఇప్పటికే నామినేషన్ల దగ్గర్నుంచి
ఎన్నికల వరకు అదే వైఖరి
● గురజాలలో మాజీ ఎమ్మెల్యే
కాసు మహేష్‌రెడ్డి హౌస్ అరెస్టు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పల్నాడు జిల్లాలో పోలీసులే రౌడీలుగా మారిపోయి బెదిరింపులకు దిగడం, కిడ్నాప్‌లు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతూ పోలీసు శాఖకే మచ్చ తెస్తున్నారు. ఎన్నికలు మొదలైన నాటి నుంచి అధికార పార్టీ నేతల ఆదేశాలు తప్ప వీరికి పోలీసు నిబంధనలు పట్టడం లేదు. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు అండగా నిలిచి, వారి గెలుపు బాధ్యతను భుజాన వేసుకుని మోసిన కొందరు అధికార పార్టీ పోలీసులు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అదే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. అర్ధరాత్రి వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి బెదిరించడం, ముఖ్య నాయకులను అక్రమంగా నిర్బంధించి పోలీసు స్టేషన్‌లకు తరలించడం, కొన్ని చోట్ల అభ్యర్థులను సైతం కిడ్నాప్ చేయడం, ఎన్నికల ఏజెంట్లను బైండోవర్ పేర్లతో స్టేషన్‌లకు పిలిచి బెదిరింపులకు పాల్పడుతున్నారు.
నామినేష్లకే అడ్డంకులు షురూ..
జిల్లాలో మొత్తం 28 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, అందులో కేవలం 7 జెడ్పీటీసీ స్థానాల్లో మాత్రమే వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయగలిగారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో జెడ్పీటీసీ మహిళా అభ్యర్థులపై సైతం దాడులు చేసి, చీరలు లాగి టీడీపీ గూండాలు దుశ్శాసన పర్వానికి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు ఆ గూండాలకు సహకరిస్తూ నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే. గురజాల నియోజకవర్గంలో నాలుగు మండలాల జెడ్పీటీసీ స్థానాల్లో, సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం మండలాల జెడ్పీటీసీ స్థానాల్లో మాత్రమే వైఎస్సార్ సీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ముప్పాళ్లలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను సైతం అక్కడి ఎస్ పి.అనిల్‌తోపాటు నరసరావుపేట అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, సీఐలు పట్టాభి తదితరులు బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఎన్నికల రోజున బయట కనిపిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తామని నేరుగా హెచ్చరిస్తున్నారు. పోలీసులు బరితెగించి వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, నాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్న తీరు చూస్తుంటే వీరు అసలు ఖాకీ దుస్తులు వేసుకున్నారా? పచ్చచొక్కాలు వేసుకున్నారా? అనే అనుమానం వస్తోంది.
గురజాల నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గురజాల డీఎస్పీ మహేశ్వరరావుతోపాటు గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల సీఐలు మురళి, ఖాజావలి, శ్రీరామ్ వెంకట్రావులు టీడీపీ గూండాల్లా మారిపోయారు. మున్సిపల్ ఎన్నికలతోపాటు ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఒక్క అభ్యర్థి కూడా వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ వేయనీయకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి మరీ అడ్డుకుని, అధికార పార్టీ ఎమ్మెల్యే వద్ద తమ స్వామిభక్తిని చాటుకున్నారు. అక్కడి ఎమ్మెల్యే యరపతినేని మెప్పుతో ఈ రెండేళ్లు మంచి పోస్టింగ్‌లు పొందాలని, వాటితోపాటు ఏకగ్రీవంగా గెలిచిన టీడీపీ అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా గురువారం జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, నరసరావుపేటలోని తన స్వగృహంలో ఉన్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారు. అంతటితో ఆగకుండా గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల మండలాల్లోని ముఖ్య నాయకులు, ఏజెంట్లు, అభ్యర్థుల కుటుంబ సభ్యులందరినీ అక్రమంగా నిర్బంధించారు. నేడు పోలింగ్ కేంద్రాల వద్దకు రాకుండా కట్టడి చేసే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇదీ ఒక గెలుపేనా అంటూ ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు, కొందరు అవినీతిపరులైన పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


