ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు మండలాల్లోని అన్ని గ్రామాల నుంచి టీడీపీ గూండాలను మోహరింపజేశారు. పథకం ప్రకారం శనివారం అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును వినుకొండ నుంచి నరసరావుపేటలోని తన నివాసానికి తరలించి హౌస్ అరెస్టు చేశారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ సరళిని గమనించిన టీడీపీ నేతలు, ఇక ఓటమి తప్పదని భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పట్టణంలోని 5, 7, 8, 12, 19, 32 వార్డులతోపాటు మరికొన్ని పోలింగ్ బూత్‌లలో సైతం ఏజెంట్లను బయటకు లాగేసి, తలుపులు మూసి రిగ్గింగ్ చేశారు. పక్క గ్రామాల నుంచి పథకం ప్రకారం టీడీపీ గుండాలను పిలిపించి, వినుకొండ టౌన్ సీఐ ప్రభాకర్ దగ్గరుండి వైఎస్సార్ సీపీ శ్రేణులను పోలింగ్ కేంద్రాల నుంచి తరలించారు. టీడీపీ గూండాలను పోలింగ్ కేంద్రాల్లోకి పంపించి రిగ్గింగ్‌ను ప్రోత్సహించారు. పచ్చచొక్కాలు వేసుకుని ఉద్యోగాలు చేస్తున్నట్లుగా సీఐ వ్యవహరించారు. వైఎస్సార్ సీపీ నేతలపై లాఠీచార్జి చేసి అధికార పార్టీపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. వినుకొండ పట్టణంలోని ఆరు వార్డుల్లోనూ రీపోలింగ్ నిర్వహించాలంటూ వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.


